తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం అవుతోంది. 21 రోజుల పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా శాఖల మంత్రులు సమీక్షలు నిర్వహిస్తూ.. వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వ్యవసాయ శాఖతో వేడుకలు ప్రారంభమవుతున్నందున తమ శాఖ ఘనత చాటేలా వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలపై ఆయన సోమవారం సచివాలయం నుంచి తమ శాఖ అధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఉత్సవాలను పురస్కరించుకుని రైతువేదికలు, వ్యవసాయ మార్కెట్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ముస్తాబు చేయాలని అధికారులు, ఉద్యోగులను ఆదేశించారు. ‘‘వ్యవసాయ రంగానికి జరిగిన మేలును, విజయగాథలను అవతరణ వేడుకల వేళ వివరించాలి. పెద్దఎత్తున పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. ఆయా మార్కెట్ల పరిధిలోని ఉత్తమ రైతులను సత్కరించాలి’’ అని మంత్రి పేర్కొన్నారు. సమీక్షలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.