తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ వేడుకలకు సంబంధించి ఆహ్వాన పత్రికను విడుదల చేసింది సర్కార్. కొత్త సచివాలయంలో జూన్ 2న ఉదయం 10.30 గంటలకు జాతీయ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించి ఉత్సవాలు ప్రారంభించనున్నారు.
మరోవైపు ఈ వేడుకలను ఇతర రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అధికారికంగా నిర్వహించనుంది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి ట్విటర్ ద్వారా వెల్లడించారు. మహాకాల్ ఉజ్జయిని నగరంలో జూన్ 2న ఆ రాష్ట్ర గవర్నర్ మంగుబాయి పటేల్ అధ్యక్షతన వేడుకలు జరుగనున్నట్టు తెలిపారు. ముఖ్య అతిథిగా ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ మోహన్‌యాదవ్ పాల్గొననున్నారని వెల్లడించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజధాని దిల్లీలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు యంత్రాంగం సిద్ధమైంది. దిల్లీలోని తెలంగాణ భవనంలో అంబేడ్కర్ ఆడిటోరియంలో వేడుకలు జరగనున్నాయి.