దేశంలో కరోనా తీవ్రత తక్కువగానే ఉంది. ఇటీవల కాలంలో 3000కు దిగువనే కేసులు నమోదు అవుతున్నాయి. ప్రపంచ దేశాల్లో కరోనా కాస్త భయపెడుతున్నా.. ఇండియాలో మాత్రం కేసుల సంఖ్య తక్కువగానే నమోదు అవుతోంది. మరోవైపు దేశంలోని 80 శాతం మంది ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించారు. దీంతో మరణాల సంఖ్య కూడా తక్కువ అయింది. కరోనాతో పాటు మరేదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు మాత్రమే ఎక్కువగా చనిపోతున్నారు.
భారత్ లో గడిచిన 24 గంటల్లో 2338 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. 19 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 17,883గా ఉంది. 24 గంటల్లో కరోనా నుంచి 2134 మంది కోలుకున్నారు. కరోనా పాజిటివిటీ రేటు 0.64గా ఉంది. కరోనా మొదలైనప్పటి నుంచి దేశంలో ఇప్పటి వరకు 4,26,15,575 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 5,24,630 మంది కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయారు. ప్రస్తుతం దేశంలో అర్హులైన వారికి 193.45 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇచ్చారు. నిన్న ఒక్క రోజు 13,33,064 మందికి వ్యాక్సిన్ అందించారు.