బాబోయ్… వీరి కరోనా కామెంట్స్ పీక్స్!

-

ప్రపంచం, దేశం మొత్తం ఒకెత్తు అయితే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి మరోకెత్తులా ఉంది! ఇందుకు కారణం ఏమిటంటారా? ప్రపంచం, దేశం మొత్తం కరోనా తీవ్రతను ఎలా తగ్గించాలి.. టెస్టుల సంఖ్యలు ఇంకా ఎలా పెంచాలి.. ఈ కరోనా పేరు చెప్పి మిగిలిన పరిపాలన ఆగిపోకుండా ఎలా చూసుకోవాలి.. కోతల సమయంలో రైతులను ఎలా ఆదుకోవాలి అనే ఆలోచనల్లో దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు కూడా కలిసి ఆలోచిస్తున్న ఈ తరుణంలో… ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటున్నారు! “నోటిముందు మైక్ పెట్టారు కాబట్టి ఎంత బలమైన కామెంట్ చేయాలి” అనే అంశంపైనే వారి దృష్టి ఉన్నట్లు కనిపిస్తుంది తప్ప… ఆ విమర్శలకు అసలు అర్ధం పర్థం ఉందా అనే ఆలోచన వారు చేయడం లేదనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో… ఇంతకూ ఏపీ టీడీపీ నేతల కరోనా కామెంట్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందా!

దేశం మొత్తం కరోనా విషయంలో ఉన్నంతలో చాలా ముందుగానే తేరుకుందని చెప్పుకోవాలి! దేశం అంటే… మట్టి కాదు… రాష్ట్రాల సమూహమే కదా! దేశంలో పరిస్థితి బాగుంది కానీ… ఏపీలో పరిస్థితి బాగాలేదు అనే స్థాయికి టీడీపీ నేతలు దిగిపోయారు! మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, పక్కనే ఉన్న తెలంగాణల్లో రోజు రోజుకీ కేసుల సంఖ్య 40 నుంచి 100 కు పైగా నమోదవుతుంటే… 6 – 7 అంటూ వీలైనంత తక్కువ కేసులు నమోదవుతున్న ఏపీలో మాత్రం కరోనా తీవ్రంగా వ్యాపిస్తుందని అంటున్నారు టీడీపీ నేతలు! పోనీ… టెస్టుల సంఖ్య అధికంగా లేదు కాబట్టి… ఇలా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతున్నాయనే అనుమానం, విమర్శలకు తావులేకుండ.. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రెండోస్థానంలో ఉంది అని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తాజాగా విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తుంది! మరి ఇంకెక్కడ లోపం కనిపిస్తుందో టీడీపీ నేతలకు!

ఈ విషయంలో టీడీపీ నేత దేవినేని ఉమ ఒక అడుగు ముందుకేసి… ఏపీలో కరోనా పరిస్థితిపై ఏకంగా “డబ్ల్యూహెచ్‌వో” దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. మోడీ ఇంత కష్టపడి, ముందు చూపుతో అన్ని రాష్ట్రలకు తగు సూచనలు చేసి, లాక్ డౌన్ ప్రకటిస్తే… ఆ ఎఫెక్ట్ పూర్తిగా ప్రజలపై పడకుండా, రైతులు ఇబ్బంది పడకుండా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్యలు తీసుకుని జాగ్రత్తగా పరిపాలిస్తుంటే… ఏపీలో పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టి పెట్టాలనే స్థాయికి టీడీపీ నేతలు దిగిపోయారు! ఇదే క్రమంలో టీడీపీ మరోనేత బోండా ఉమ అయితే… ఆంధ్రప్రదేశ్, అమెరికా స్థాయిలో కరోనా బారిన పడిపోతుందనే స్థాయిలో మాట్లాడుకొచ్చారు! ఏదో లాక్ డౌన్ ప్రకటించబట్టి పరిస్థితి ఇలా ఉంది కానీ.. లేదంటే ఏపీ కూడా అమెరికా స్థాయిలో ఇబ్బందిపడేదని చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ ప్రకటించకపోతే… ఏపీ ఏమిటి… దేశం మొత్తం పరిస్థితి ఏమయ్యేదో సదరు బోండాకే తెలియాలి!

ఇలా కరోనా గురించి తీవ్ర సంక్షోబం ఎదుర్కొంటున్న తరుణంలో… ఈ రేంజ్ లో “కరోనా రాజకీయానికి” తెరలేపారు టీడీపీ నేతలు! ప్రభుత్వ అసమర్ధత వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని వీరంతా అంటారే తప్ప… వారి కంటికి కనిపించని ఆ సమర్ధత ఎలా వస్తుందో, ఏయే సూచనలు పాటించాలో మాత్రం చెప్పరు. ఇక ఆ పార్టీ అధినేత సంగతంటారా… అసలు రాష్ట్రంలోనే లేరు! పదిలక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చి, వీడియో కాల్స్ మాట్లాడుతూ తన బాధ్యత తీరిపోయిందని భావించారో ఏమో కానీ… తాను ఇంత చేస్తుంటే, జగన్ ఏమి చేస్తున్నారు అంటూ విమర్శల వర్షాలు కురిపిస్తున్నారు!! ఈ పరిస్థితిని గమనిస్తున్నవారు మాత్రం… సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా టీడీపీ నేతల ప్రవర్తన, అడ్డగోలుతనం ఇలానే ఉండేదని, దాని ఫలితం ఎన్నికల ఫలితాల్లో కనిపించిందని, దేవుడు నోరిచ్చాడని.. మీడియా మైకిచ్చిందని.. జనాలు వింటున్నారని.. పత్రికలు రాస్తున్నాయని.. చేసే విమర్శలు అర్ధవంతంగా లేకపోతే మాత్రం ప్రజల చీత్కారాలు ఎదుర్కోక తప్పదని కామెంట్స్ వినిపించడం చెప్పుకోవడం కొసమెరుపు!!

Read more RELATED
Recommended to you

Latest news