మార్చి 22.. జనతా కర్ఫ్యూను పాటించిన రోజు.. తరువాత రెండు రోజులకు ప్రధాని మోదీ.. ఇండియా లాక్‌డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. అయితే ఇప్పుడు ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం.. రాత్రి 9 గంటలకు అందరినీ లైట్లు ఆర్పి దీపాలు వెలిగించమన్నారు. అప్పుడు వైద్యులు, వైద్య సిబ్బందికి మద్దతు పలుకుతూ జనతా కర్ఫ్యూను పాటించాలని మోదీ పిలుపునిస్తే.. ఇప్పుడు కరోనాపై పోరాటానికి దేశప్రజలమంతా ఒకేతాటిపై ఉన్నాం.. అనే విషయాన్ని చాటి చెప్పేందుకు దీపాలు వెలిగించాలని మోదీ పిలుపునిచ్చారు. అయితే జనతా కర్ఫ్యూను పాటించాక.. ఇండియా లాక్‌డౌన్‌తో మోదీ సంచలన నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు ఏప్రిల్ 5 తరువాత మోదీ ఏం నిర్ణయాన్ని ప్రకటిస్తారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
గతంలో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు మోదీ రాత్రికి రాత్రే ప్రకటించి.. అవినీతి పరుల గుండెల్లో గునపం దింపారు. అయితే ఇప్పుడు యావత్ దేశ ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా మహ్మమారి భరతం పట్టాలంటే.. ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని.. మోదీ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఏప్రిల్ 5 తరువాత మోదీ ఆ కఠిన నిర్ణయాలను ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే అవి ఏమై ఉంటాయని.. ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఢిల్లీలో మర్కజ్ ఘటన బయట పడకముందు అంతా బాగానే ఉందని భావించారు. కానీ ఆ ఘటన తరువాత దేశంలో పరిస్థితులు మారిపోయాయి. ఒక్కసారిగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు భారీగా పెరిగాయి. అయితే మరో నాలుగైదు రోజులు పరిస్థితి ఇలాగే ఉండవచ్చని.. ఆ తరువాత కేసుల సంఖ్య క్రమంగా తగ్గి.. ఏప్రిల్ 15వ తేదీ వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య సున్నా అవుతుందని.. నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇలా జరగకపోతే.. మోదీ మరిన్ని కఠిన నిర్ణయాలను అమలు చేసేందుకే మొగ్గు చూపుతారని తెలుస్తోంది. అందులో భాగంగానే.. ప్రజలను అలాంటి కఠిన పరిస్థితులకు అలవాటు చేసేందుకే.. ఏప్రిల్ 5న అందరితో దీపాలు వెలిగించి.. కరోనాపై పోరులో అందరమూ ఐక్యంగా ఉండాలనే విషయాన్ని చాటి చెప్పనున్నారని.. దాంతో ప్రజలు ఒకరకంగా మానసికంగా ఎలాంటి పరిస్థితికైనా సిద్ధం అవుతారని మోదీ భావిస్తున్నట్లు తెలిసింది.
అయితే మరో 2, 3 రోజుల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గి.. కొంత వరకు సంతృప్తికరమైన పరిస్థితులు ఏర్పడితే.. మోదీ లాక్‌డౌన్ ఎత్తివేతపై ప్రకటన కూడా చేయవచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 5 దాటితే గానీ.. మోదీ అసలు ఏం చెప్పనుందీ.. మనకు తెలియదు. కనుక అప్పటి వరకు వేచి చూడాల్సిందే..!