Women’s Day : నీ అంత ఓపిక ఎక్కడా చూడలేదమ్మా… హ్యాపీ ఉమెన్స్ డే నీకు…!

-

ఉదయం 6 అయ్యింది. మొహం కడిగి టీ పెట్టీ ఇచ్చింది అమ్మ నాన్న కి. కూర్చుని టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరూ. ఇంతలో గుడి నుంచి వచ్చింది నానమ్మ, వస్తూనే నానమ్మ రుస రుసలాడటం చూసిన అమ్మ గబగబా స్నానానికి వెళ్లిపోయింది. నాన్న లేచి బయటకి వెళ్లిపోయాడు. స్నానం చేసి వచ్చి పూజ చేసి, టిఫిన్ కి ఇడ్లీ వేస్తుంది అమ్మ. అత్తగారు వచ్చి నాకు ఇడ్లీ వద్దు, అట్టు వేసి ఇవ్వు అంది. సరే అని అలానే అట్టు వేసి ఇచ్చి, నాన్నకి, నాకు ఇడ్లీ పెట్టింది.

ఇంతలో పని మనిషి వచ్చి అమ్మ గారు కూరకి కూరగాయలు ఏం కొయ్యాలో ఇవ్వండి అంది. అమ్మ ఈ రోజైనా మంచి కూర వండమ్మా నేను, నానమ్మ నాకు 1 పచ్చిమిర్చి మాత్రమే వేసి వండు కూర, కారం వేస్తుంటే నాకు పడట్లేదు కూరల్లో అంది. చప్పిడి కూర తినలేక చస్తున్నా రోజూ ఈ రోజు కొంచెం స్పెషల్ గా ఏదైనా చెయ్ అన్నాడు నాన్న. ఇవన్నీ వింటున్న పని మనిషి అమ్మగారు ఒక్కొకరికి ఒక్కోరకంగా కావాలంట, ఏం వండుతారు అంది. ఒక పచ్చిమిర్చి వేసి ఒక కూర, నాన్న కి ఒక రకం, నాకోసం ఘుమఘమలాడే ఒక కూర వండటం మొదలు పెట్టింది అమ్మ.

ఇంతలో నానమ్మ వచ్చి అక్కడ బూజులు వేలాడుతున్నాయి కనిపించడం లేదు ఎవరికి, అన్ని నేనే చెప్పాలి అని పని మనిషి మంగ తో వాదులాడుతుంది. నా వల్ల కాదు అమ్మ మీ ఇంట్లో పని చేయడం రోజూ ఇల్లు ఉడ్చేటప్పుడు మీ అత్తగారికి నన్ను ఏదోకటి అనడం అలవాటైంది అని పని వదిలేసి పోయింది. నాన్న లోపలికి వచ్చి 3 నెలలకి ఒక పని మనిషి మారుతుంది, ఇలా అయితే కష్టం అంటుంటే నీ పెళ్ళానికి ఏది పట్టదు అన్ని నేనే చూస్కుని చెప్పాలి, అందరికీ నేనే రాకాసి ల కనిపిస్తున్నాను అని నానమ్మ, నాన్న గొడవ పడుతుంటే ఏది పట్టనట్టు వంట చేసుకుంటూ పోతుంది అమ్మ.

అన్ని చూస్తున్న నేను… అమ్మ నానమ్మ పరోక్షంగా నిన్నే కదా అన్నాను. అమ్మ చిన్నగా నవ్వి అలానే అంటారు లే అవన్నీ పట్టించుకోక నువ్వు చదువుకో అంది. ఇంతలో మధ్యాహ్నం 12.30 అయింది. వండినవి అన్ని టేబుల్ మీద సర్ది బోజనానికి రమ్మని పిలిచింది అమ్మ. నాన్న, నానమ్మ, నేను వచ్చి కూర్చుంటే అందరికీ వడ్డించి తను కూర్చుంది, ఒక పచ్చిమిర్చి వేసి వండిన కూర వేసుకుని తిని, తర్వాత నాన్నకి, నాకు వండినవి కూడా వేసుకుని రుచి చూసి నానమ్మ వండినవి వంక పెట్టీ మరీ భోజనం పూర్తి చేసింది.

నేను నాన్న చూసి నవ్వుకుంటూ తినేసాం. అమ్మ కూడా చిన్నగా నవ్వి వెళ్లిపోయింది. సాయంత్రం 6 అయింది. దేవుడి దగ్గర దీపం పెట్టీ, కాసేపు అరుగుమీద కూర్చోడానికి వెళ్ళింది అమ్మ. నన్ను రమ్మంటే నేను రనాన్నను. అది మా వీధి లో ఆడవాళ్ళు కాసేపు కాలక్షేపం చేసే టైమ్ అది. నేను టీవీ చూస్తున్నాను, ఇంతలో నానమ్మ గొనుగుడు మొదలైంది. రోజూ అరుగులెక్కి కూర్చుని సోది. పని పాట లేదు. ఏమై నా అంటే అన్నా అంటారు అని ఒకటే గొనుగుడూ. అమ్మ వచ్చేసరికి ఆపేసింది. నాన్న కూడా సాయంత్రం బయటకి వెళ్ళి వచ్చారు.

ఏమంటుందే మా అత్తయ్య అని నాన్న అడిగితే అమ్మ ఏదో చెప్తుంది. సరిపోయింది వీడు ఇలానే తయారయ్యాడు. వెళ్లొద్దని చెప్పడం మానేసి అని మూతి తిప్పుకుని నేను ధ్యానం చేసుకుని వస్తాను అంటూ వెళ్ళిపోయింది. అమ్మ కుక్కర్ పెట్టీ, నానమ్మ రాత్రి పూట అన్నం తినదు, ఆవిడకి చపాతీ చేసింది. షరా మామూలే చపాతీ గట్టిగా ఉందని చెప్పి తినేసి టీవీ సీరియల్ చూస్తుంది నానమ్మ. సీరియల్ వచ్చే బాధలు చూసి లోకం ఎలా తయారైంది అని కాసేపు నిట్టూర్చి పడుకోడానికి తన గదికి వెళ్లిపోయింది.

ఉదయం లేవగానే మళ్లీ అన్ని మామూలే. ఇలా దాదాపుగా 25 ఏళ్ల నుంచి చూస్తున్న మా ఇంట్లో. నానమ్మ విసుగు, నిట్టూర్పు, నాన్న కోపం, చిరాకు, నా సాధింపు అన్ని 25 ఏళ్ల నుంచి చూస్తున్న. అమ్మ ఒక్కరికీ తిరిగి సమాధానం చెప్పడం నేను ఎప్పుడూ చూడలేదు. అమ్మ డిగ్రీ చదివింది. నాన్న 10th ఫెయిల్, అమ్మ కి 17 ఏళ్ల వయసులో పెళ్లి అయింది. పెళ్లి అయ్యాక చదువుకుంది అమ్మ.

నాన్న రకరకాల వ్యాపారాలు చేసి వచ్చిన నష్టాలు చాలనుకుని వ్యాపారం చేయడం మానేసి మాకున్న కొద్దిపాటి ఆస్తి మీద వచ్చే సంపాదనతో మా కుటుంబం గడిచేది. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన మా అమ్మలో నేను ఎప్పుడూ కంగారు చూడలేదు. నష్టాలు వచ్చినప్పుడు నాన్న నీ చిన్న చూపు చూడటం ఎప్పుడూ చూడలేదు. మాకు ఎలా కావాలో, మేము అడిగినవన్నీ చేయడమే కాని తనకోసం ఏనాడూ సమయాన్ని కేటాయించుకోలేదు మా అమ్మ. ఇవన్నీ చూస్తూ పెరిగిన నాకు మా అమ్మే నాకు స్ఫూర్తి. ఒక సాధారణ సగటు ఆడదానిగా మా సక్సెస్ స్టోరీ ఇది. హ్యాపీ ఉమెన్స్ డే అమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news