ఇప్పుడు కాలం ఒకప్పటిలా లేదు. ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే ఎక్కువగా జరిగేవి. యువతీ యువకులు చాలా పిన్న వయస్సులోనే వివాహాలు చేసుకునేవారు. కానీ ఇప్పుడలా కాదు. ఎవరికి నచ్చిన వారిని వారు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని సార్లు కొందరు ఇష్టం లేని వివాహాలు కూడా చేసుకుంటున్నారు. దీంతో వారు తాము పెళ్లి చేసుకున్న జీవిత భాగస్వామిని విడిచిపెట్టి ప్రేమించిన వారితో పారిపోతున్నారు. మధ్యప్రదేశ్‌లోనూ సరిగ్గా ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. దాని వివరాల్లోకి వెళితే…
మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లాకు చెందిన ఓ యువతి (21)కి ఈ నెల 7వ తేదీన సిరోజ్ అనే ఓ యువకుడితో వివాహం అయింది. ఆ తరువాత ఆమె పలు కారణాలు చెప్పి మెట్టింటి నుంచి పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలోనే ఆమె ఈ నెల 23వ తేదీన రూ.1.50 లక్షల విలువ చేసే ఆభరణాలు, రూ.30వేల నగదు తీసుకుని కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబీకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అయితే సిరోజ్‌కు, ఆ యువతికి పెళ్లి చేసిన వినోద్ శర్మ అనే పూజారి కూడా కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా అసలు విషయం తెలిసింది. సదరు వినోద్ శర్మకు ఆ యువతికి 2 సంవత్సరాల నుంచే పరిచయం ఉందని, వారు గతంలో కొంత కాలం సహజీవనం కూడా చేశారని పోలీసులు కనుక్కున్నారు. అలాగే వారిద్దరూ పారిపోవాలని కూడా అనుకున్నారు. కానీ ఆ యువతికి సిరోజ్‌తో పెళ్లయింది. ఇక ఆ పెళ్లిని కూడా పూజారి వినోద్ శర్మే జరిపించాడు.
అయితే వివాహం అయ్యాక వినోద్ శర్మ, ఆ యువతి వేసుకున్న ప్లాన్ ప్రకారం.. ఆ యువతి తన పుట్టింటికి వెళ్లగానే.. ఆమె అక్కడి నుంచి నగలు, నగదు తీసుకుని పూజారి వినోద్ శర్మతో పారిపోయింది. ఈ క్రమంలో పోలీసులు ప్రస్తుతం ఆ ఇద్దరి కోసం గాలిస్తున్నారు. కాగా వినోద్ శర్మకు అంతకు ముందే వివాహం అయిందని, అతనికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. ఏది ఏమైనా ఇప్పుడీ వార్త మాత్రం నెట్‌లో వైరల్ అవుతోంది..!