తల్లిదండ్రుల తర్వాత స్థానం ఎవరిది.. అంటే టక్కున గురువుదే అని చెప్పేయొచ్చు. అంతటి ఉన్నత స్థానాన్ని గురువుకు ఇచ్చాం. ఎందుకు.. అంటే గురువు చదువు చెప్పి మనకు సరైన మార్గాన్ని చూపిస్తాడు కాబట్టి. తల్లిదండ్రులు కనడం, పెంచడం వరకే.. కానీ గురువు జీవితాన్ని నేర్పిస్తాడు. మరి.. అటువంటి గురువు కనిపిస్తే ఏం చేయాలి.. కాళ్లకు మొక్కాలి.. దండం పెట్టాలి. కానీ.. ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో మాత్రం పూర్తిగా రివర్స్ లో జరిగింది. చదువు చెప్పే గురువే విద్యార్థుల కాళ్లకు మొక్కుతున్నాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.
మధ్యప్రదేశ్ లోని మందసౌర్ లో ఉన్న రాజీవ్ గాంధీ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఏబీవీపీకి చెందిన విద్యార్థులు కాలేజీలో భగ్గుమన్నారు. పరీక్షల ఫలితాలు రిలీజ్ చేయడంలో ఆలస్యం చేశారంటూ కాలేజీలో నిరసన వ్యక్తం చేశారు. నినాదాలు చేస్తున్నారు. అదే సమయంలో దినేశ్ గుప్తా అనే ప్రొఫెసర్ క్లాస్ చెబుతున్నాడు. వీళ్ల నినాదాలకు క్లాస్ డిస్టర్బ్ అవడంతో బయటికి వచ్చి ఇక్కడ నినాదాలు చేయవద్దని.. క్లాస్ జరుగుతున్నదని వాళ్లను కోరుతాడు. వాళ్లు వినకపోగా.. మరింత రెచ్చిపోయి ప్రొఫెసర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం మొదలు పెట్టారు. తమకు సారీ చెప్పాలని భయపెట్టారు. దీంతో భయపడిన ప్రొఫెసర్ ఆ విద్యార్థుల కాళ్లు మొక్కి క్షమించాలంటూ వేడుకున్నాడు. దీంతో విద్యార్థులు ఆ ప్రొఫెసర్ ను వదిలేశారు.