ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయం ప్రజలను వెంటాడుతోంది. అందుకనే చాలా మంది ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇక తప్పనిసరి అయి బయటికి వచ్చేవారు కచ్చితంగా మాస్కులను ధరిస్తున్నారు. అలాగే ఇతర జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయితే కరోనా వైరస్ ఇప్పటి వరకు మనుషులకు మాత్రమే వ్యాప్తి చెందింది కానీ.. జంతువులకు ఆ వైరస్ వ్యాప్తి చెందుతుందని ఎక్కడా శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. కానీ ఆ విషయం తెలియని ఆ వ్యక్తి నిజంగా భయపడ్డాడో.. ఏమో.. తెలియదు కానీ.. తాను పెంచుకునే మేకలకు మాత్రం కరోనా రాకూడదని చెప్పి మాస్కులను తొడిగాడు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..?
ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండలం పేరువంచ గ్రామం ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెంకటేశ్వరరావు తాను పెంచుకుంటున్న మేకలకు మాస్కులు తొడిగాడు. అనంతరం వాటిని మేత కోసం బయటకు తీసుకువచ్చాడు. ఈ క్రమంలో ఆ మేకలను ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు కేవలం మనుషులకు మాత్రమే కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. కానీ జంతువులకు అది వస్తుందని సైంటిస్టులు ఇంకా చెప్పలేదు. ఈ విషయంపై వారు ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా అతను అలా మాస్కులు తొడగడం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
కాగా భారత్‌లో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 6761 గా ఉండగా.. 516 మంది కరోనా నుంచి బయట పడ్డారు. మరో 206 మంది మృతి చెందారు.