సాధారణంగా కోర్టుల్లో జడ్జీలు ఏం తీర్పు ఇస్తుంటారు. ఫైన్ వేయడమో.. జైలు శిక్ష వేయడమో చేస్తుంటారు. కానీ.. ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ కోర్టు వినూత్న తీర్పు ఇచ్చి సంచలనం సృష్టించింది. ఓ నిందితుడికి ఐదు మొక్కలు నాటితేనే అరెస్ట్ వారెంట్ రద్దు చేస్తానని ఘజియాబాద్ జిల్లా అదనపు ప్రభుత్వ కౌన్సిలర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
నాలుగేళ్ల కింద జరిగిన ఓ కిడ్నాప్, రేప్ కేసులో నిందితుడిగా ఉన్న రాజు గత ఆరు నెలలుగా విచారణకు హాజరు కావడం లేదట. దీంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి రాకేశ్.. రాజుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. తనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారని తెలుసుకున్న రాజు.. తనపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను రద్దు చేయాలని ఘజియాబాద్ కోర్టులో మొర పెట్టుకున్నాడు. దీంతో కోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది. ఐదు మొక్కలు నాటి.. విచారణకు సహకరిస్తానని అఫిడవిట్ దాఖలు చేసి కోర్టుకు సమర్పించాలని కోర్టు తెలిపింది.