కమల్‌హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీకి టార్చిలైట్‌ను గుర్తుగా ఈసీ కేటాయించింది. దీంతో ఈ గుర్తుపైనే కమల్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్ మక్కల్ నీది మయ్యం పేరిట గతంలో ఓ రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. 2018 ఫిబ్రవరి 21వ తేదీన కమల్ తన పార్టీని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్‌గానే ఉంటున్నారు. అప్పుడప్పుడు తమిళనాడుతోపాటు దేశంలో జరిగే పలు ఘటనలపై కూడా కమల్ స్పందిస్తూ వస్తున్నారు. అయితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని కమల్ ప్రకటించగా, ప్రస్తుతం ఆయన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది.
కమల్‌హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీకి టార్చిలైట్‌ను గుర్తుగా ఈసీ కేటాయించింది. దీంతో ఈ గుర్తుపైనే కమల్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇక ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని కమల్ మొదట్నుంచీ చెబుతూ వస్తున్నారు. అందులో భాగంగానే ఆయన తన పార్టీ అభ్యర్థులను ఒంటరిగానే బరిలోకి దింపనున్నారు.
కాగా పార్టీ గుర్తు కేటాయింపుపై కమల్ మాట్లాడుతూ… ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. తమకు టార్చిలైట్ గుర్తును కేటాయించినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి కమల్ కృతజ్ఞతలు తెలిపారు. తమ పార్టీకి టార్చి లైట్ తగిన గుర్తని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం పార్టీ టార్చ్ బేరర్‌గా మారుతుందని కమల్ అన్నారు.