సబితా ఇంద్రారెడ్డి కేటీఆర్, కవితలను కలవడంతో కాంగ్రెస్ పెద్దలంతా షాక్‌నకు గురయ్యారు. దీంతో ఆమె తెరాసలో చేరుతారని వార్తలు ఊపందుకున్నాయి.
ఏపీలో ఓ వైపు అధికార పార్టీ టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతుంటే.. మరోవైపు ఇటు తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు టీఆర్ఎస్‌లో చేరగా, తాజాగా మరో ముఖ్యమైన నేత కూడా తెరాసలో చేరుతున్నారని తెలిసింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో భారీ షాక్ తగలనుంది. మాజీ హోం మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి త్వరలో కాంగ్రెస్ ను వీడి తెరాసలో చేరుతున్నట్లు తెలిసింది. త్వరలోనే ఆమె కేసీఆర్ సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకుంటారని సమాచారం.
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. చేవెళ్ల చెల్లెమ్మగా ఆమెను పిలుస్తారు. వైఎస్ హయాంలో ఆమె హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలో ఆమె దేశంలోనే ఓ రాష్ట్రానికి హోం మంత్రిగా తొలిసారిగా పనిచేసిన మహిళగా రికార్డులకెక్కారు. అయితే తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలో ఆమె తన కుమారుడికి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వకపోవడంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. అందువల్లే కాంగ్రెస్ ను వీడాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
కాగా సబితా ఇంద్రారెడ్డి కేటీఆర్, కవితలను కలవడంతో కాంగ్రెస్ పెద్దలంతా షాక్‌నకు గురయ్యారు. దీంతో ఆమె తెరాసలో చేరుతారని వార్తలు ఊపందుకున్నాయి. అయితే తెరాసలో సబితా ఇంద్రారెడ్డి చేరేందుకు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మధ్యవర్తిత్వం జరుపుతున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే ఇవాళ అసద్ ఇంట్లో కేటీఆర్, కవితలను కలిసేందుకు సబితా ఇంద్రారెడ్డి తన కుమారుడిని వెంట తీసుకెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. దీంతో త్వరలోనే సబిత కారెక్కుతారని తెలుస్తోంది. కాగా లోక్‌సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి తెరాసలో చేరిక అంశం నిద్ర పట్టనీయడం లేదని సమాచారం..!