యాక్..! డ్రైనేజీ నీటితో కూరగాయలను పండించి అమ్ముతున్నారు..!

పంజాబ్‌లోని మోహాలీ జిల్లా జిరక్‌పూర్ టౌన్ సమీపంలో ఉన్న శతబ్‌గఢ్, ఛత్ అనే పలు గ్రామాల్లో కొందరు రైతులు డ్రైనేజీ నీటిని ఉపయోగించి కూరగాయలను పండిస్తున్నారు.

మార్కెట్‌లో మనం ప్రస్తుతం కొంటున్న కూరగాయల్లో అధిక శాతం వరకు క్రిమి సంహారక మందులను వాడి పండించినవే ఉంటున్నాయి. దీంతో మనం అనేక అనారోగ్యాల బారిన పడుతున్నాం. అయితే ఇది చాలదన్నట్లు కొన్ని చోట్ల కొందరు ఏకంగా డ్రైనేజీ నీటిని ఉపయోగించి పంటలను పండించి అనంతరం వాటిని మనకు అమ్ముతున్నారు. వింటేనే ఒళ్లు జలదరిస్తుంది కదా.. అయితే ఇది జరుగుతున్నది మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కాదు లెండి.. పంజాబ్‌లో..!

పంజాబ్‌లోని మోహాలీ జిల్లా జిరక్‌పూర్ టౌన్ సమీపంలో ఉన్న శతబ్‌గఢ్, ఛత్ అనే పలు గ్రామాల్లో కొందరు రైతులు డ్రైనేజీ నీటిని ఉపయోగించి కూరగాయలను పండిస్తున్నారు. అనంతరం ఆ కూరగాయలను జిరక్‌పూర్‌తోపాటు మోహాలీ, దెరబస్సి అనే టౌన్లకు తరలించి అమ్ముతున్నారు. దీంతో ఇప్పుడీ విషయం అక్కడ సంచలనమే అవుతోంది. అయితే రైతులు డ్రైనేజీ పైపులైన్లలోని నీటిని దారి మళ్లించి ఇలా ఆ నీటితో పంటలను పండిస్తున్నారని గుర్తించారు.

అయితే ఆ రైతులు ఇలా చేస్తుండడంపై అక్కడి అధికారులు స్పందించారు. రైతులు అలా డ్రైనేజీ నీటిని వాడితే పంటల్లో పూర్తిగా సారం పోయి వాటిల్లో ఇక పంటలు పండవని, అలాగే ఆ నీటిని వాడి పండించిన కూరగాయలను తినడం వల్ల మనకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రైతులు చెరువులు, కాలువలు, ఇతర ప్రదేశాల్లోని నీటిని వాడేలా చర్యలు తీసుకుంటామని అక్కడి మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. మనం తినే కూరగాయలు, పండ్లపై ఓ కన్నేసి ఉంచడం బెటర్. లేదంటే.. ఇదిగో.. పైన చెప్పిన విధంగా పండించిన వాటిని తిని అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది.. కనుక జాగ్రత్త..!