బతుకమ్మ సంబురంతో మురిసిన తెలంగాణం

-

బతుకమ్మ సంబురాలతో తెలంగాణం మురిసింది. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటాయి. మహిళలంతా ఉత్సాహంగా ఒకచోట కలిసి వేడుకలా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. గునుగు, తంగేడు, కట్ల, బంతి, చామంతి, సీత జడ, గులాబీలు ఇలా తీరొక్క పువ్వులతో బతుకమ్మలు కొలువుదీరాయి.  గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి బతుకమ్మలను తీసుకువెళ్లి పండుగలో పాల్గొన్నారు.

ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సంబురాల్లో ఆడిపాడారు. భాగ్యనగరంలో తొలిరోజే బతుకమ్మ శోభ ఉట్టిపడింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఊరూవాడా సంబురాలు హోరెత్తాయి. హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయం తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో పూలవనంలా మారింది. తరలివచ్చిన వేల మంది మహిళలతో సందడి నెలకొంది. బతుకమ్మ పాటలకు అనుగుణంగా వారంతా నృత్యాలు చేస్తూ హోరెత్తించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంలో విద్యుద్దీపకాంతుల నడుమ.. మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. మిగిలిన జిల్లాల్లోనూ ఉయ్యాల పాటలు మారుమోగాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news