సద్దుల బతుకమ్మ అంటే ఏమిటి? ఆ రోజు ప్రత్యేకతలు..

తెలంగాణలో ముఖ్యంగా చెప్పుకొనే పండుగల లో ఒకటి బతుకమ్మ, రెండు బోనాలు..బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పండుగ..తొమ్మిదిరోజులపాటు తొమ్మిది రకాలుగా బతుకమ్మను చేసి ఘనంగా వేడుకలను చేస్తారు.తొమ్మిదిరోజుల బతుకమ్మ సంబరం క్రమంగా పెరుగుతూ ముగింపుకు చేరుకుంది. ఒక్కో పువ్వు తెచ్చి బతుకమ్మను పేర్చి తెలంగాణ అంతా గొంతెత్తి బతుకమ్మ పాట పాడుతుంటే, ఆ పాట దేశం నలుదిక్కులూ మార్మోగితే తెలంగాణ సంస్కృతి దేశాలు దాటి సందడి చేస్తే. ఆ బతుకమ్మ తల్లి పువ్వంత స్వచ్ఛంగా, రంగంత ఆహ్లాదంగా నవ్వేదువు..

పండుగ ఎప్పుడూ సంబరమే. అలాంటి బతుకమ్మ సంబరం వెనుక ఎన్నో గూడు కట్టుకున్న గుండె పాటలున్నాయి. అన్ని చోట్లా అందరూ చెబుతున్న కథలే, తెలంగాణ పడుచులు తమ బాధను బతుకమ్మ రూపంలో పాటలు కట్టి పాడుకుంటూ, దొరల దౌర్జ్యన్యాలను ప్రశ్నిస్తున్నట్టు తెలుపుతాయి.. బతుకమ్మకు అయిదు సద్దుల నైవేద్యం పెడతారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం, నిమ్మకాయ అన్నం. ఇలా అయిదు నైవేద్యాలు పెట్టాక రొట్టె, చక్కెర కలిపి చేసే లడ్డును కూడా నైవేద్యంగా పెడతారు.

తొమ్మిది అంతరలుగా పేర్చిన సద్దుల బతుకమ్మ చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. రంగురంగుల పూలతో సంబరమంతా తనదే అన్నట్టు ఉంటుంది. బతుకమ్మకు పోటీగా ప్రతి ఇంటి ఆడబిడ్డ ఎంతోఅందంగా తయారయ్యి చెట్టులో పువ్వంత హాయిగా నవ్వుతూ సంతోషంగా ఉంటారు. ఇది ఒక ఎత్తు అయితే ఆ రోజు సాయంత్రం ఒక ఎత్తు..తొమ్మిది రోజుల పాటు చేసిన బతుకమ్మను గంగమ్మ ఒడిలోకి నిమర్జనం చేస్తారు.

సాయంత్రం ఆడపిల్లలు అందరూ ఇంతెత్తున పేర్చిన బతుకమ్మను తీసుకుని వీధి కూడలిలో చేరి పెద్ద పెద్ద బతుకమ్మల చుట్టూ చేరి గుండ్రంగా తిరుగుతూ, జాపినపద పాటలు పాడుకుంటూ తన్మయత్వంలో మునిగిపోతారు. బతుకమ్మల చుట్టూ తిరుగుతున్న ఆడబిడ్డలను వారి సంతోషాన్ని వర్ణించడం చాలా కష్టం. అలా చీకటి పడేవరకు ఆడి పాడి, ఆ తరువాత బతుకమ్మలను ఎత్తుకుని ఊరేగుతూ నీళ్లున్న ప్రాంతానికి వెళ్లి గౌరమ్మను ఇముడ్చుకున్న బతుకమ్మను, గంగమ్మ ఒడికి చేరుస్తారు. ఆ తరువాత రొట్టె, చెక్కెరతో తయారు చేసిన నైవేద్యం ను అందరికి పంచి తాము తిని, ఇంటికి వెళ్లి ఇంటిల్లిపాదికి పంచిపెడతారు. దాంతో సద్దుల బతుకమ్మతో పాటు బతుకమ్మ పండుగ కూడా ముగుస్తుంది..ఎన్నో ఔషధ గుణాలు ఉన్నా ఆ నీటి వల్ల పంటలు బాగా పండి సంతోషంగా గడుపుతారని ప్రజలు నమ్ముతారు..