ఆలు రైస్.. చిటికెలో చేద్దామా..!

ప‌నిఒత్తిడి, అల‌స‌ట లేదా.. ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల మ‌నం ఒక్కోసారి బ‌య‌టి నుంచి ఆహారాన్ని పార్శిల్ తెచ్చుకుని ఇండ్ల‌లో తింటుంటాం. అయితే కొంచెం ఓపిక చేసుకోవాలే గానీ.. 10 నిమిషాల్లో చ‌క్క‌ని రైస్ వంట‌కాన్ని మ‌న‌మే స్వ‌యంగా చేసుకుని ఆర‌గించ‌వ‌చ్చు. అందుకు పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నిలేదు. అలాంటి సుల‌భ‌త‌ర‌మైన రైస్ వంట‌కాల్లో ఆలు రైస్ కూడా ఒక‌టి. మ‌రి దీన్ని ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఆలు రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

అన్నం – 1 క‌ప్పు
ఆలుగ‌డ్డ‌లు – 2 (ఉడ‌క‌బెట్టిన‌వి)
ఉల్లిపాయ – 1 (ముక్క‌లుగా క‌ట్ చేయాలి)
వెల్లుల్లి రెబ్బ‌లు – 2 (ముక్క‌లుగా క‌ట్ చేయాలి)
పుదీనా త‌రుగు – 2 టీస్పూన్లు
ప‌చ్చి మిర్చి – 1
గ‌రం మ‌సాలా, షాజీరా – 1/2 టీ స్పూన్
కారం – 1/4 టీస్పూన్
ప‌సుపు – చిటికెడు
నూనె, ఉప్పు – త‌గినంత
బిరియానీ ఆకు, జాజికాయ – ఒక్కొక్క‌టి
యాల‌కులు – 4
దాల్చిన చెక్క – 1 అంగుళం
ల‌వంగాలు – 6

ఆలు రైస్ త‌యారు చేసే విధానం:

ఆలుగ‌డ్డ‌ల‌ను నీళ్లు పోసి ఉడ‌క‌బెట్టాలి. ఒక గిన్నెలో నూనె పోసి వేడి చేయాలి. అనంత‌రం అందులో బిర్యానీ ఆకు, యాల‌కులు,  దాల్చిన చెక్క, ల‌వంగాలు, ప‌చ్చి మిర్చి, షాజీరా, జాజికాయ వేసి వేయించాలి. అందులో ఉల్లిపాయ‌లు, వెల్లుల్లి వేసి ఒక నిమిషం పాటు బాగా వేయించాలి. అనంత‌రం ఉడ‌క‌బెట్టిన‌ ఆలుగ‌డ్డ ముక్క‌ల‌ను వేయాలి. వాటిని కొంత‌సేపు ఫ్రై చేయాలి. అనంత‌రం అందులో ప‌సుపు, ఉప్పు, కారం, పుదీనా ఆకులు, గ‌రం మ‌సాలా వేసి బాగా క‌ల‌పాలి. ఆ త‌రువాత అన్నం వేయాలి. రెండు నిమిషాల పాటు బాగా క‌ల‌పాలి. అనంత‌రం కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి బాగా క‌ల‌పాలి. దీంతో ఆలురైస్ త‌యార‌వుతుంది. దీన్ని రైతాతో క‌లిపి తిన‌వ‌చ్చు. లేద‌గా కారంగా చేసుకుంటే రైతా లేకుండానే తిన‌వ‌చ్చు..!