ఘుమ ఘుమ‌లాడే ఆలూ చికెన్ బిర్యానీ.. ఇలా చేయండి..!

చికెన్‌తో మ‌నం చేసుకునే వంట‌కాల్లో చికెన్ బిర్యానీ కూడా ఒక‌టి. ఇందులోనూ అనేక వెరైటీలు ఉంటాయి. చాలా మంది త‌మ ఇష్టాల‌కు అనుగుణంగా ప‌లు ర‌కాల చికెన్ బిర్యానీ వెరైటీల‌ను చేసుకుని తింటుంటారు. అయితే చికెన్‌తో ఆలూ చికెన్ బిర్యానీ కూడా చేసుకుని తిన‌వ‌చ్చు. అది కూడా ఎంతో రుచిగా ఉంటుంది. బిర్యానీ ప్రియులు క‌చ్చితంగా ఆ వంట‌కాన్ని ఇష్ట‌ప‌డుతారు. మ‌రి ఆలూ చికెన్ బిర్యానీ ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఆలూ చికెన్ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

చికెన్ – 1/2 కిలో
సగం ఉడికిన అన్నం – ఒకటిన్నర కిలో
ఆలుగ‌డ్డ‌లు – 4 లేదా 5 (కావలసిన సైజులో ముక్కలుగా క‌ట్‌ చేసుకోవాలి)
దాల్చిన చెక్క – చిన్న ముక్క
యాలకులు – 4 లేక 5
మిరియాలు – త‌గిన‌న్ని
బిర్యానీ ఆకు – కొద్దిగా
పచ్చిమిర్చి – 8
ఉల్లిపాయ ముక్కలు – 2 కప్పులు
కారం – సరిపడా
నిమ్మరసం – 1 టేబుల్‌ స్పూను
కొత్తిమీర – 1 కప్పు (క‌ట్ చేసిన‌ది)
కుంకుమ పువ్వు – కొద్దిగా
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు

ఆలూ చికెన్ బిర్యానీ తయారు చేసే విధానం:

ముందు బియ్యాన్ని సగం ఉడికించి ప‌క్కన పెట్టాలి. ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో చికెన్ ముక్క‌లు, కారం, ఉప్పు, నిమ్మ‌ర‌సం, చిటికెడు ప‌సుపు వేసి బాగా క‌లిపి ప‌క్క‌న పెట్టాలి. ఒక పెద్ద పాన్ లేదా క‌ళాయి తీసుకుని అందులో నూనె వేసి వేడెక్కాక ఆలుగ‌డ్డ ముక్క‌ల‌ను కొద్దిగా వేయించి ప‌క్క‌న పెట్టాలి. అదే నూనెలో పచ్చిమిరపకాయలు, దాల్చినచెక్క, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకుల‌ను వేసి దోర‌గా వేయించుకోవాలి. వాటిలో ఉల్లిపాయ ముక్క‌ల‌ను కూడావేసి మ‌రికొంత స‌మ‌యం పాటు వేయించాలి. అనంత‌రం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో క‌ల‌పాలి. అన్నీ బాగా వేగాయి అనుకున్న త‌రువాత చికెన్ ముక్క‌ల‌ను కూడా వేసి మ‌రికొంత సేపు వేయించాలి. చివ‌రిగా ఆలుగ‌డ్డ ముక్క‌ల‌ను అందులో వేయాలి. అనంత‌రం స‌గం ఉడికిన అన్నాన్ని రెండు భాగాలు చేసుకోవాలి. అందులో ఒక భాగంపై అంత‌కు ముందు వేయించి పెట్టుకున్న మిశ్ర‌మాన్ని లేయ‌ర్‌లా ప‌రుచుకోవాలి. అనంత‌రం మ‌ళ్లీ అన్నం రెండో భాగం దానిపై ప‌ర‌చాలి. దానిపై మ‌ళ్లీ మిగ‌తా కూర‌ను కూడా ప‌ర‌చాలి. అనంత‌రం కుక్క‌ర్‌లో 1 లేదా 2 విజిల్స్ మాత్ర‌మే వ‌చ్చే వ‌ర‌కు ఉంచి దింపాలి. చివ‌రిగా అన్నంపై కొత్తిమీర చ‌ల్లి గార్నిష్ చేసుకోవాలి. అంతే.. ఆలూ చికెన్ బిర్యానీ త‌యార‌వుతుంది. దాన్ని అలాగే తిన‌వ‌చ్చు. లేదా మిర్చీ కా సాల‌న్‌, రైతాల‌తో ఆస్వాదించ‌వ‌చ్చు.