ఇక‌పై ఇంట‌ర్ ఉండ‌దు.. నేరుగా డిగ్రీయే చ‌ద‌వాలి.. మోదీ అది అమ‌లు చేస్తే కింగే..!

-

దేశంలో ఉన్న అన్ని స్కూళ్ల‌లో ఒకే త‌ర‌హా విద్యావిధానం ఉంటుంది. అంటే ప్రీ ప్రైమ‌రీ మొద‌లుకొని ఇంట‌ర్ వ‌ర‌కు స్కూల్ స్థాయిలోనే చ‌ద‌వాలి. అలాగే డిగ్రీ నాలుగేళ్లు చ‌ద‌వాలి. ఇక ఇంట‌ర్ మాత్రం ఉండ‌దు.

న‌ర్స‌రీ.. ఎల్‌కేజీ.. యూకేజీ.. ఆ త‌రువాత 1 నుంచి 10వ త‌ర‌గ‌తి.. అటుపై 2 ఏళ్ల పాటు ఇంట‌ర్‌.. ఆ త‌రువాత డిగ్రీ.. ఇదీ ప్ర‌స్తుతం మ‌న దేశంలో ఉన్న విద్యావ్య‌వ‌స్థ తీరు. ఈ క్ర‌మంలో విద్యార్థుల‌పై చ‌దువుల భారం అధికంగా ప‌డుతోంది. అలాగే పాఠ‌శాల‌లు, ప్రైవేటు కాలేజీలు కూడా పెద్ద ఎత్తున ఫీజుల‌ను వసూలు చేస్తున్నాయి. దీనికి తోడు చ‌దువు భారం ప‌డి డిప్రెష‌న్‌కు లోన‌య్యే విద్యార్థులు మార్కులు స‌రిగ్గా రాలేద‌న్న కార‌ణంతో ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. అయితే ఇక‌పై ఇలాంటి ఇబ్బందులేవీ ఉండ‌వు. ఎందుకంటే.. కేంద్ర ప్ర‌భుత్వం త్వ‌ర‌లో ఓ స‌రికొత్త విద్యావిధానాన్ని అమ‌లులోకి తేనుంది. దాన్ని దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ క‌చ్చితంగా అమ‌లు చేయ‌నున్నారు.

మోదీ ఇటీవ‌ల జ‌రిగిన దేశ వ్యాప్త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. ఈ సారి అధికారంలోకి వ‌స్తే దేశంలో ఉన్న విద్యావ్యవ‌స్థ‌లో స‌మూల‌మైన మార్పులు తెస్తామ‌ని చెప్పారు క‌దా. చెప్పిన‌ట్లుగానే ఆయ‌న త్వ‌ర‌లో ఓ నూత‌న విద్యావిధానాన్ని అమ‌లు చేయ‌నున్నారు. కాగా ఇస్రో మాజీ చీఫ్ క‌స్తూరి రంగ‌న్ నేతృత్వంలో 2017లోనే ఈ విద్యావిధాన రూప‌క‌ల్ప‌న‌కు బీజం ప‌డింది. అప్పట్లో రంగ‌న్ నేతృత్వంలో 9 మందితో కూడిన నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేశారు. ఆ త‌రువాత ఆ క‌మిటీ అనేక అధ్య‌య‌నాలు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో క‌మిటీ స‌భ్యులు మొన్న‌ కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి ర‌మేష్ పొఖ్రియాల్‌కు 484 పేజీల‌తో కూడిన నివేదిక (జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ))ను స‌మ‌ర్పించారు.

విద్య‌ను లాభాపేక్ష‌తో చూడ‌రాద‌ని, ప్ర‌భుత్వ‌, ప్రైవేటు విద్యాసంస్థ‌ల‌ను స‌మానంగా ప‌రిగ‌ణించాల‌ని, దేశ ప్ర‌స్తుత‌, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా, ఉపాధి క‌ల్ప‌న‌కు.. విద్యార్థుల‌ను సిద్ధం చేసేలా విద్యావ్య‌వ‌స్థ ఉండాల‌ని స‌ద‌రు నివేదిక‌లో అంశాల‌ను పొందు ప‌రిచారు. అదేవిధంగా దేశ‌వ్యాప్తంగా పాఠ‌శాల విద్య ఒకే ర‌కంగా ఉండాల‌ని కూడా క‌మిటీ అభిప్రాయ‌ప‌డింది. అలాగే ఉన్న‌త విద్య‌ను అంత‌ర్జాతీయం చేయాల‌ని, ఓపెన్‌, డిస్టెన్స్ విద్య‌ను మ‌రింత మెరుగు ప‌ర‌చాల‌ని, విద్యావ‌కాశాల్లో లైంగిక‌, సామాజిక‌, ప్రాంతీయ అస‌మాన‌త‌ల‌ను తొల‌గించాల‌ని కూడా క‌మిటీ నిపుణులు తెలిపారు. ఇక ఈ క‌మిటీ ఇచ్చిన నివేదిక‌పై ఈ నెల 30వ తేదీ లోపు ఎవ‌రైనా స‌రే..త‌మ అభిప్రాయాలు, సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను [email protected] మెయిల్‌కు పంపించ‌వ‌చ్చు.

దేశంలో విద్యావ్య‌వ‌స్థ‌ను మ‌రింత అభివృద్ధి ప‌రిచేందుకు, కాలానుగుణంగా అందులో మార్పుల‌ను చేసేందుకు.. ప్ర‌ధాని అధ్య‌క్ష‌త‌న జాతీయ విద్యాక‌మిష‌న్ (ఎన్ఈసీ) ఏర్పాటు చేయాల‌ని రంగ‌న్ క‌మిటీ త‌న నివేదిక‌లో సూచించింది. ఆ క‌మిష‌న్‌లో కేంద్ర విద్యాశాఖ మంత్రి వైస్ చైర్ ప‌ర్స‌న్‌గా ఉంటారు. కాగా ఎన్ఈసీలో 20 నుంచి 30 మంది స‌భ్యులు ఉంటారు. వీరిలో విద్యావేత్త‌లు, ప‌రిశోధ‌కులు, ఆర్ట్స్, బిజినెస్‌, ఆరోగ్యం, వ్య‌వ‌సాయం, సామాజిక సేవ త‌దిత‌ర రంగాల్లో పేరుగాంచిన నిపుణులు స‌గం మంది ఉంటారు. అలాగే కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, నీతి ఆయోగ్ వైస్ చైర్ ప‌ర్స‌న్‌, ప్ర‌ధాని ముఖ్య కార్య‌ద‌ర్శి, కేబినెట్ సెక్ర‌ట‌రీ, విద్యాశాఖలో సీనియ‌ర్ కార్య‌ద‌ర్శి త‌దిత‌రులు ఎన్ఈసీలో ముఖ్య స‌భ్యులుగా ఉంటారు. దీనికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా ఉంటారు. ఈయ‌న 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారు. ఈయ‌న‌కు స‌హాయ మంత్రి హోదా ఉంటుంది.

జాతీయ ఎడ్యుకేష‌న్ క‌మిష‌న్ త‌ర‌హాలోనే అన్ని రాష్ట్రాల్లోనూ రాష్ట్ర ఎడ్యుకేష‌న్ క‌మిష‌న్ల‌ను ఏర్పాటు చేస్తారు. వాటికి ఆయా రాష్ట్రాల‌కు చెందిన సీఎంలు అధ్య‌క్షులుగా ఉంటారు. అలాగే ఆ క‌మిష‌న్ల‌లో ఆయా రాష్ట్రాల‌కు చెందిన విద్యాశాఖ మంత్రులు వైస్ చైర్ ప‌ర్స‌న్లుగా ఉంటారు. ఇక రంగ‌న్ క‌మిటీ ఇచ్చిన నివేదిక ప్ర‌కారం… ఇక‌పై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్డీ) ఉండ‌దు. దానికి బ‌దులుగా కేంద్ర విద్యాశాఖను ఏర్పాటు చేస్తారు. ఈ శాఖ ఆధ్వ‌ర్యంలోనే నూత‌న విద్యావిధానం అమ‌లు, తీరుతెన్నులు న‌డుస్తాయి.

కాగా మోదీ ప్ర‌భుత్వం అమ‌లులోకి తేనున్న కొత్త విద్యావిధానంలో ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ (ఈసీసీఈ) ఉంటుంది. అంటే ప్రీ ప్రైమరీ అన్నమాట‌. గ‌తంలో ఇది 1వ త‌ర‌గ‌తి నుంచే ఉండేది. కానీ దీన్ని ఇంకా వెనక్కి తీసుకొచ్చారు. దీంతో ప్రీ ప్రైమ‌రీ కూడా ఇందులో భాగంగానే ఉంటుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల విద్యార్థుల‌కు ఎంతో మేలు క‌లుగుతుంది. అలాగే కరికులర్‌, కో కరికులర్‌, ఎక్స్‌ట్రా కరికులర్ అనే తేడాలు కూడా ఇక‌పై ఉండ‌వు. ఆటలు, ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌, స్పోర్ట్స్‌, యోగా, కమ్యూనిటీ సర్వీస్‌ తదితరాలన్నీ పాఠ్యాంశాల్లో భాగంగానే ఉంటాయి. అంటే ప్ర‌తి స్కూల్ క‌చ్చితంగా ఈ అంశాల‌ను బోధ‌న‌లో చేర్చాల్సి ఉంటుంది.

నూత‌న విద్యావిధానం అమ‌లులోకి వ‌స్తే ఇక‌పై విద్యార్థుల‌కు చ‌దువు చెప్పే టీచ‌ర్ల‌కు క‌నీస అర్హ‌త డిగ్రీ క‌చ్చితంగా ఉండాలి. అలాగే బీఈడీ కూడా నాలుగేళ్లు చ‌ద‌వాలి. ఈ ప్ర‌మాణాలు పాటించ‌ని స్కూళ్ల‌ను మూసేస్తారు. ఇక ఉన్న‌త స్థాయి విద్య‌లో ప‌రిశోధ‌న‌ల‌కు పెద్ద పీట వేయ‌నునున్నారు. అలాగే దేశ వ్యాప్తంగా ఇక‌పై హిందీని ప్ర‌తి విద్యార్థి చ‌ద‌వాల్సి ఉంటుంది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన ఏదో ఒక భాష‌ను పాఠ్యాంశంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. అదే హిందీయేత‌ర రాష్ట్రాల్లో హిందీతోపాటు, త‌మ ప్రాంతీయ భాష‌ను చ‌ద‌వాల్సి ఉంటుంది. అంటే.. ఉదాహ‌ర‌ణ‌కు ఏపీ, తెలంగాణలు హిందీయేత‌ర రాష్ట్రాలు క‌నుక ఇక్క‌డ హిందీతోపాటు, విద్యార్థులు తెలుగును త‌ప్ప‌నిస‌రిగా చ‌ద‌వాలి. అలాగే అన్ని రాష్ట్రాల విద్యార్థుల‌కు ఇంగ్లిష్ స‌బ్జెక్టు క‌చ్చితంగా ఉంటుంది.

నూత‌న విద్యావిధానం అమ‌లులోకి వ‌స్తే స్కూళ్లు, కాలేజీలు త‌మ ఇష్టానుసారంగా ఫీజుల‌ను పెంచుతామంటే కుద‌ర‌దు. అలా పెంచినా వీలు కాదు. ఎందుకంటే ఫీజుల నియంత్ర‌ణ‌కు ప్ర‌త్యేక సంస్థ‌ను ఏర్పాటు చేస్తారు. వారు అధికంగా ఫీజులు వ‌సూలు చేసే స్కూళ్లు, కాలేజీల‌పై చ‌ర్య‌లు తీసుకుంటారు. అయితే స్కూళ్లు, కాలేజీల యాజ‌మాన్యాలు తాము అందించే స‌దుపాయాలు, దేశంలో ఉన్న ద్ర‌వ్యోల్బ‌ణానికి అనుగుణంగా ఫీజుల‌ను పెంచుకునే వీలు మాత్రం ఉంటుంది. ఇక చివ‌రిగా.. దేశంలో ఉన్న అన్ని స్కూళ్ల‌లో ఒకే త‌ర‌హా విద్యావిధానం ఉంటుంది. అంటే ప్రీ ప్రైమ‌రీ మొద‌లుకొని ఇంట‌ర్ వ‌ర‌కు స్కూల్ స్థాయిలోనే చ‌ద‌వాలి. అలాగే డిగ్రీ నాలుగేళ్లు చ‌ద‌వాలి. ఇక ఇంట‌ర్ మాత్రం ఉండ‌దు. అంటే విద్యార్థులు ప్రీప్రైమ‌రీ (న‌ర్స‌రీ, ఎల్‌కేజీ, యూకేజీ) + 5 + 3 + 3 + 4 త‌రహాలో ఇక‌పై విద్య‌ను అభ్య‌సిస్తార‌న్న‌మాట‌. అంటే.. విద్యార్థులు దాదాపుగా పాఠ‌శాల స్థాయిలోనే ఇంట‌ర్‌ పూర్తి చేసి ఆ త‌రువాత నేరుగా డిగ్రీ చ‌దువుతార‌న్న‌మాట‌. ఈ క్ర‌మంలో వారు మ‌ళ్లీ ఇంటర్ చ‌ద‌వాల్సిన ప‌నిలేదు. అంటే.. ఇక‌పై ఇంట‌ర్ విద్య‌కు, ఆ కాలేజీల‌కు మంగ‌ళం పాడేసిన‌ట్లే అవుతుంది.

నిజంగా మోదీ గ‌న‌క ఈ విద్యావిధానాన్ని అమ‌లు చేస్తే.. ఎంతో మంది విద్యార్థుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని విద్యా నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే మ‌రో వారం, ప‌ది రోజుల్లో ఈ ఏడాది విద్యాసంవ‌త్స‌రం ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఈ నూత‌న విద్యావిధానం ఇప్పుడు అమ‌ల‌య్యే అవ‌కాశం లేదు. కానీ అంద‌రి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుని ఈ విద్యావిధానాన్ని వ‌చ్చే ఏడాది నుంచే ప్ర‌వేశపెట్టే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇక ఆ విద్యా విధానం అమ‌లయ్యే వ‌ర‌కు మ‌నం వేచి చూడాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Latest news