చంద్ర‌బాబు కాంగ్రెస్‌తో బంధం కొన‌సాగిస్తారా..? ఎటూ తేల్చుకోలేక‌పోతున్న టీడీపీ అధినేత‌..?

-

కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ రాహుల్ రాజీనామాను ఆమోదించ‌క‌పోయిన‌ప్ప‌టికీ రాహుల్ మాత్రం త‌న నిర్ణ‌యంపై వెన‌క్కి త‌గ్గడం లేదు. ఇలాంటి స్థితిలో కాంగ్రెస్‌తో క‌ల‌సి వెళ్ల‌డం.. అంటే భ‌విష్య‌త్తులో టీడీపీకి ప్ర‌మాద‌మేన‌ని తెలుగు త‌మ్ముళ్లు అంటున్నార‌ట‌.

దేశ్య‌వ్యాప్త సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తోపాటు అటు ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా ముగిసి ఫ‌లితాలు వ‌చ్చేశాయి. అటు మోదీ మ‌రోసారి ప్ర‌ధాని అవ‌గా, ఇటు ఏపీకి జ‌గ‌న్ సీఎం అయ్యారు. కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైకాపాలు విజ‌య‌ఢంకా మోగించ‌డంతో ప్ర‌తిప‌క్షాల అడ్ర‌స్ గ‌ల్లంత‌య్యింది. ఇక గ‌తేడాది కేంద్రంలో ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి కాంగ్రెస్‌తో జ‌ట్టు క‌ట్టిన చంద్ర‌బాబు ప్ర‌జ‌లు ఇచ్చిన అనూహ్య తీర్పుకు కోలుకోలేని షాక్‌లో ఉన్నారు. అయితే ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డి అయ్యే వ‌ర‌కు.. మొన్న‌టి దాకా చంద్ర‌బాబు కాంగ్రెస్‌తో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగారు. మ‌రోసారి కేంద్రంలో యూపీఏ అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్పి దేశంలో ఉన్న యూపీఏ మిత్ర‌ప‌క్షాల‌ను ఒక్క‌తాటిపైకి చేర్చే య‌త్నం చేశారు. కానీ ఫ‌లితాల వెల్ల‌డి అనంత‌రం కాంగ్రెస్ పార్టీకి బాబు దూరంగా ఉన్నారు. మ‌రి ఈ విష‌యంపై బాబు భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక ఏమిటి ? ముందు ముందు కూడా టీడీపీ కాంగ్రెస్‌తో మిత్ర‌బంధాన్ని కొన‌సాగిస్తుందా..? అంటే…

ప్ర‌స్తుతం టీడీపీ ఉన్న స్థితిలో కాంగ్రెస్‌తో ఇక‌పై మిత్ర‌బంధాన్ని కొన‌సాగించే అవ‌కాశం లేద‌ని రాజ‌కీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.. ఇటీవ‌ల జ‌రిగిన దేశ వ్యాప్త సార్వ‌త్రిక ఎన్నికల ఫ‌లితాల్లో కాంగ్రెస్‌కు పెద్ద షాక్ త‌గిలింది. ఆ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇది ఆ పార్టీ నేత‌ల‌ను తీవ్రంగా క‌ల‌చివేస్తోంది. ఎన్నో సంవ‌త్స‌రాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న అమేథీలో రాహుల్ ఓడిపోవ‌డం ఆ పార్టీ శ్రేణుల‌ను మ‌రింత నిరుత్సాహానికి గురి చేసింది.

ఇక దేశ‌వ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్‌కు ప‌రాభ‌వ‌మే ఎదురైంది. ఆ పార్టీకి ప్ర‌తిప‌క్ష హోదాను ద‌క్కించుకునేందుకు అవ‌స‌ర‌మైన ఎంపీ సీట్లు కూడా రాలేదు. దీంతో రాహుల్.. కాంగ్రెస్ ఓట‌మికి బాధ్య‌త వ‌హిస్తూ ఆ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ రాహుల్ రాజీనామాను ఆమోదించ‌క‌పోయిన‌ప్ప‌టికీ రాహుల్ మాత్రం త‌న నిర్ణ‌యంపై వెన‌క్కి త‌గ్గడం లేదు. ఇలాంటి స్థితిలో కాంగ్రెస్‌తో క‌ల‌సి వెళ్ల‌డం.. అంటే భ‌విష్య‌త్తులో టీడీపీకి ప్ర‌మాద‌మేన‌ని తెలుగు త‌మ్ముళ్లు అంటున్నార‌ట‌. అస‌లు మొద‌ట్నుంచీ కాంగ్రెస్‌తో పొత్తు అనేది టీడీపీలో ఎవ‌రికీ ఇష్టం లేదు. కానీ జాతీయ స్థాయిలో బీజేపీకి మ‌రో ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్ త‌ప్ప వేరేది లేదు. క‌నుక ఆ పార్టీతో క‌ల‌వ‌క త‌ప్ప‌ద‌ని బాబు గ‌తంలో టీడీపీ నాయకుల‌ను ఒప్పించారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని దేశ‌మంతా బాబు తిరిగారు. కానీ చివ‌ర‌కు సీన్ రివ‌ర్స్ అయింది. దీంతో ఇప్పుడు చంద్ర‌బాబు ఎటూ తేల్చుకోలేని స్థితిలో సైలెంట్‌గా ఉన్నారు. మ‌రి భ‌విష్య‌త్తులో కాంగ్రెస్‌తో కొన‌సాగుతారా, లేదా పాత ప‌గ‌లు మ‌రిచిపోయి క‌ల‌సి మెల‌సి ఉందాం.. అంటూ బీజేపీ ఎదుట మోక‌రిల్లుతారా.. అనేది తెలియాలంటే.. మ‌రికొద్ది రోజులు వేచి చూడ‌క త‌ప్ప‌దు..!

Read more RELATED
Recommended to you

Latest news