బిడ్డకు జన్మనివ్వడం అనేది తల్లికి పునర్జన్మ లాంటిదే.. పుట్టిన బిడ్డను ఎత్తుకోగానే.. పురిటి నొప్పుల కష్టం అంతా మరిచిపోయి తనివితీరా ఆ బిడ్డను చూసుకుంటుంది. కానీ బిడ్డ పుట్టి పుట్టగానే.. బేబీకి పచ్చకామెర్లు ఉన్నాయని నర్సులు తీసుకెళ్లిపోతారు. ఇలాంటి ఘటనలు చాలాసార్లు జరిగే ఉంటాయి. మూడు రోజుల పాటూ లైట్స్ కిందే ఉంచాలని, పాలు ఇచ్చినప్పుడు మాత్రమే బయటికి తీయాలని చెబుతారు. ఎందుకిలా పుట్టిన పిల్లలకు కామెర్లు వస్తాయి? అవి అంత ప్రమాదకరమా..? సాధరణమేనా..?
పుట్టిన వెంటనే దాదాపు 70 శాతానికి పైగా పిల్లల్లో కామెర్లు కనిపిస్తాయి. పుట్టిన రెండో రోజు నుంచే కామెర్లు బయటపడతాయని వైద్యులు అంటున్నారు..అయితే వీటిని చూసి భయపడక్కర్లేదు. వీటికి కాలేయానికి ఎలాంటి సంబంధం ఉండదట… పుట్టిన తరువాత బయట వాతావరణానికి అలవాటు పడేందుకు బిడ్డల శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. అలాంటి సమయంలో కామెర్లు కనిపించడం సహజం.. ఫోటో థెరపీ లైట్స్ కింద రెండు రోజులు పెడితే ఇవి తగ్గిపోతాయి. అలాగే ఎండలో కూడా రోజులో కాసేపు ఉంచినా మంచి ఫలితం ఉంటుంది.
ప్రమాదం ఎప్పుడంటే..
కొంతమంది పిల్లల్లో శరీరం పచ్చగా మారిపోతుంది. ముఖం, కాళ్లు, చేతులు కూడా రంగు మారుతాయి. మూత్రం ముదురుగా వస్తుంది. ఇలాంటప్పుడు మాత్రమే వైద్యులు సీరియస్గా తీసుకుంటారు. అలా అని వీరికి ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏం ఉండదు.. ఫోటో థెరపీ లైట్స్ కింద ఎక్కువ రోజులు పెట్టి గమనిస్తారు. రెండు వారాలకు మించి ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం చాలా ప్రమాదం. అప్పుడు ప్రత్యేక చికిత్సలు చేయాల్సి ఉంటుంది..
బ్లడ్ గ్రూప్ మారితే ప్రమాదం ఎక్కువ..
పిల్లలకు కామెర్లు ప్రాణాంతకంగా మారే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే.. తల్లి బ్లడ్ గ్రూపు నెగిటివ్ ఉండి, బిడ్డది పాజిటివ్ ఉన్నప్పుడు… ఆ బిడ్డకు కామెర్లు తీవ్రస్థాయిలో వచ్చే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు… అలాగే తల్లిది O పాజటివ్ బ్లడ్ గ్రూపు అయి ఉండి, బిడ్డకు A లేదా B పాజిటివ్ బ్లడ్ గ్రూపులు వచ్చినా కూడా కామెర్లు విపరీతంగా వచ్చి ఇబ్బందిపెడతాయట.. ఇలాంటి సమయంలో వైద్యుల పర్యవేక్షణ చాలా అంటే చాలా అవసరం. బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే ఇంటికి పంపిస్తారు. వైద్యులు అలానే అంటారు తీసుకెళ్దాం.. మాకు రాలేదా, మా బిడ్డలకు రాలేదా అని మీరు లైట్ తీసుకొని బిడ్డను ఎట్టిపరిస్థితుల్లో ఇంటికి తీసుకెళ్లొద్దని నిపుణులు సూచిస్తున్నారు.