ఏపీలోని నిరుద్యోగులకు వైద్య, ఆరోగ్య శాఖ శుభవార్త చెప్పింది. జిల్లా ఆసుపత్రిలోని పలు ఖాళీల భర్తీకి ఏపీ వైద్యారోగ్య శాఖ ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, సెక్యూరిటీ గార్డు తదితర 53 ఖాళీలను భర్తీ చేసేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పలు పోస్టులకు కనీస అర్హత ఐదో తరగతి మాత్రమే. మిగతా పోస్టులకు సంబంధిత అంశంలో డిగ్రీ, డిప్లొమా, ఎంబీబీఎస్.. అర్హతలుగా నిర్ణయించింది.
విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు. ఇందుకు ఎలాంటి రాతపరీక్ష ఉండదని వారు స్పష్టంచేశారు. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు పోస్టు ద్వారా ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఖాళీల వివరాలు..
స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, పీడియాట్రీషియన్, సెక్యూరిటీ గార్డ్స్, మెడికల్ ఆఫీసర్
అర్హతలు, ఇతర వివరాలు.. పోస్టులను బట్టి ఐదో తరగతి, 10వ తరగతి, ఇంటర్/ జీఎన్‌ఎం/ డిగ్రీ/ బీఎస్సీ/ ఎంబీబీఎస్/ డిప్లొమా/ పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్, ఉద్యోగ అనుభవం తప్పనిసరి. దరఖాస్తుదారుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ. 300 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/వికలాంగ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంపికైన అభ్యర్థులు ఆయా పోస్టులను బట్టి రూ.12 వేల నుంచి రూ.1,10,000 వేలు నెలనెలా జీతంగా అందుకుంటారు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా.. జిల్లా వైద్యాధికారి కార్యాలయం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.