మనం తినే ఆహారాలను జీర్ణం చేయడంతోపాటు వాటిలో ఉండే పోషకాలను మన శరీరానికి అందేలా చూడడంలో జీర్ణ వ్యవస్థ పాత్ర చాలా కీలకమైంది. దీంతోపాటు ఆ ఆహార పదార్థాల్లో ఉండే వ్యర్థాలను కూడా జీర్ణవ్యవస్థ బయటకు పంపుతుంది. అయితే జీర్ణవ్యవస్థ పనితీరు సరిగ్గా లేకపోతే గ్యాస్, అసిడిటీ, కడుపు నొప్పి, అజీర్ణం, విరేచనాలు తదితర సమస్యలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుచుకునేందుకు కింద తెలిపిన ఆహారాలను నిత్యం తీసుకోవాలి. దీంతో జీర్ణం బాగా అవడమే కాదు, ఆయా జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మరి ఆ ఆహారాలు ఏమిటంటే…
1. పెరుగులో ప్రొ బయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. అంటే మన శరీరానికి మంచి చేసే బాక్టీరియా అన్నమాట. ఇది మన జీర్ణాశయం, పేగుల్లో ఉంటుంది. ఈ బాక్టీరియా సంఖ్యను పెంచితే మనకు జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. అందుకు గాను నిత్యం మనం పెరుగు లేదా మజ్జిగను తీసుకోవాలి. దీంతో జీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
2. యాపిల్ పండ్లలో పుష్కలంగా ఉండే పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబర్ జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేందుకు దోహదపడుతుంది. కనుక నిత్యం యాపిల్ పండ్లను తినడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
3. సోంపు గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణాశయంలో ఆహారం కదలికను సరిచేస్తుంది. దీంతో కడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్ రాకుండా ఉంటాయి. తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
4. మనం భోజనం చేసిన వెంటనే తినదగిన పండ్లలో బొప్పాయి పండు కూడా ఒకటి. ఇందులో ఉండే పపెయిన్ అనే ఎంజైమ్ మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేస్తుంది. దీంతో గ్యాస్, అసిడిటీ రాకుండా ఉంటాయి. మలబద్దకం తగ్గుతుంది.
5. బీట్‌రూట్‌లో ఉండే ఫైబర్ మనం తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. అలాగే పెద్ద పేగులో మలం కదలికను సరి చేస్తుంది. దీంతో మలబద్దకం ఉండదు.
6. నిత్యం ఉదయాన్నే అల్పాహారానికి ముందు కొద్దిగా అల్లం రసం సేవిస్తే.. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అలాగే వికారం, వాంతులు తగ్గుతాయి. గ్యాస్, అసిడిటీ రాకుండా ఉంటాయి.
7. భోజనానికి ముందు పుదీనా రసం తీసుకుంటే జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. విరేచనాలు ఆగుతాయి.