వేసవిలో బీర్ తాగడం వల్ల ఒక లాభం ఉంటుంది. అదేమిటంటే.. అందులో చాలా వరకు నీరు ఉంటుంది కనుక, మన శరీరానికి కొంత నీరు అందుతుంది. దీంతో బయటకు పోయే నీటి లోటును అది పూడుస్తుంది.
ఎండలు దంచి కొడుతున్నాయి. మే నెల రాకతో ఇంకొన్ని రోజుల్లో ఎండలు మరింత ముదరనున్నాయి. ఈ క్రమంలో మండుతున్న ఎండలు, వేడితో జనాలు అల్లాడిపోతున్నారు. అందుకే కాలు బయట పెట్టాలంటే జంకుతున్నారు. ఇక అత్యవసర స్థితి ఉంటే తప్ప ఎవరూ బయటికి రావడం లేదు. వచ్చినా చల్లని మార్గాల వైపు చూస్తున్నారు. అందుకనే చాలా మంది తమ శరీరాలను చల్లగా ఉంచుకోవడం కోసం శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ వంటివి తాగుతున్నారు. అయితే మద్యం ప్రియులు ఎండల్లో విస్కీ, బ్రాందీ, రమ్, వోడ్కా కన్నా బీర్ తాగేందుకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటారు. ఎందుకంటే చల్ల చల్లని బీర్ తాగితే శరీరం చల్లగా ఉంటుందని వారు అనుకుంటారు. అయితే ఇందులో నిజం ఎంత ఉంది ? నిజంగానే బీర్ తాగితే శరీరం చల్లబడుతుందా ? వేసవిలో బీర్ తాగవచ్చా ? అనే ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీర్ కూడా ఇతర ఆల్కహాలిక్ డ్రింక్స్‌లాగే ఉంటుంది. కాకపోతే అందులో ఆల్కహాల్ తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో చల్లని బీర్‌ను తాగితే అందులో ఉండే ఆల్కహాల్ వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అంటే ఒంట్లో ఉన్న నీరు అంతా బయటకు పోతుంది. అయితే వేసవిలో సహజంగానే మన శరరీంలో ఉండే నీరు డీహైడ్రేషన్ వల్ల బయటకు వెళ్లిపోతుంది. దీంతో మనకు దాహం అవుతుంది. అదే ఈ కాలంలో ఇక బీర్ కాదు, ఏ ఇతర ఆల్కహాలిక్ డ్రింక్ తాగినా సరే.. డీహైడ్రేషన్ మరింత ఎక్కువవుతుంది. దీంతో మన శరీరంలో ఉండే నీరు ఇంకా త్వరగా బయటకు పోతుంది. అది మనకు అస్సలు మంచిది కాదు. కనుక వేసవిలో బీర్ కాదు, ఇతర ఏ ఆల్కహాలిక్ డ్రింక్‌ను తాగకుండా ఉండడమే బెటర్.
అయితే ఇతర ఆల్కహాలిక్ డ్రింక్స్ మాటేమోగానీ.. వేసవిలో బీర్ తాగడం వల్ల ఒక లాభం ఉంటుంది. అదేమిటంటే.. అందులో చాలా వరకు నీరు ఉంటుంది కనుక, మన శరీరానికి కొంత నీరు అందుతుంది. దీంతో బయటకు పోయే నీటి లోటును అది పూడుస్తుంది. అంత మాత్రాన బీరు తాగాలని కాదు. కానీ బీర్ తాగడం వల్ల అందులో ఉండే నీరు మనకు అందుతుంది కనుక కొంత వరకు మన శరీరంలో ద్రవాల సమతుల్యత ఉంటుంది. కానీ అదే సమయంలో బీర్‌లో ఉండే ఆల్కహాల్ ఆ నీటిని బయటకు పంపుతుంది.. కనుక బీర్ తాగినా, తాగకపోయినా.. పెద్ద తేడా ఏమీ ఉండదు. కాకపోతే దాహంగా ఉంటే.. వాటర్ అందుబాటులో లేకపోతే.. బీర్ దొరికితే లాగించేయండి..!