కరోనా టైమ్ లో “డిప్రెషన్ వ్యాధి” తీవ్రతరం.. తెలుసుకోవాల్సిన విషయాలు.

మహమ్మారి సమయంలో కరోనా సోకుతుందన్న భయంతో పాటు డిప్రెషన్ (Depression) వ్యాధి పెరుగుతుందన్న భయమూ ఉంది. ఆర్థిక పరిస్థితులు చితికిపోవడం, ప్రియమైన వాళ్ళు దూరమవడం, ఇలా రకరకాల కారణాల వల్ల డిప్రెషన్ చుట్టుకుంటుంది. ఈ డిప్రెషన్ పై సైకియాట్రిస్ట్ “మిర్యాల శ్రీకాంత్” గారు పంచుకున్న విషయాలు.

మీకు తెలుసా దిగులు ( depression) వ్యాధి, మధుమేహం (diabetes) కంటే సాధారణ మైన వ్యాధి అని? అలాగే ఇది నూటికి ఎనభై మందిలో నయం అవుతుందని తెలుసా? కొన్ని విషయాలు గమనిద్దాం.

గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ ర్యాంకింగ్స్లో గుండెజబ్బులకు తలదన్ని డిప్రెషన్ మొదటి స్థానంలో ఉంది, అంటే ఒక వ్యాధి ప్రపంచ ప్రజల్ని ఎంత పీడిస్తోంది అన్నదానికి ఒక సూచిక ఇది. అలాగే ఉత్పాదక వయసులో ఉన్నవాళ్ళలో (20-60) రోడ్డుప్రమాదాల తర్వాత అత్యధిక మరణాలు ఆత్మహత్యల వలన జరుగుతున్నాయి.

డిప్రెషన్ లో స్వల్ప స్థాయి/తీవ్ర స్థాయి అని రెండు రకాలు ఉంటాయి. ప్రతీ రోగికి ఉండే లక్షణాల తీవ్రతని బట్టి ఇది ఉంటుంది.దీనికి వైద్యం మూడు రకాలు.
1. కౌన్సిలింగ్
2. మందులు
3. జీవనవిధానంలో మార్పులు
4. ECT- ఎలక్ట్రో కన్స్వుల్సివ్ థెరపీ ( షాక్ ట్రీట్మెంట్)-ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు.

డిప్రెషన్ లక్షణాలు

1. దిగులు/ చికాకు
2. త్వరగా అలసిపోవడం
3. దేని మీదా ఆసక్తి లేకపోవటం
4. ఏకాగ్రత కుదరకపోవడం
5. నిద్ర పట్టకపోవడం
6. ఆకలి వేయకపోవడం
7. అప్రయత్నంగా బరువు తగ్గటం
8. లైంగిక కోరికలు తగ్గటం/ లేకపోవటం
9. ఇతరులకు దూరంగా ఉండటం
10. నెగటివ్ ఆలోచనలు రావటం
11. ఆత్మహత్య ఆలోచనలు

నెగటివ్ ఆలోచనలు అంటే – భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉండటం, తీవ్రమైన ఆత్మ విమర్శ,ఆత్మ నింద,ఎవరూ తనకు సహాయం చేయలేరు అనుకోవటం,ఎప్పటికీ ఇలానే ఉండిపోతాను అనుకోవటం,నేనేదో తప్పుచేశాను అందుకే ఈ శిక్ష, నాకిలాగే కావాలి,నన్ను ఆ భగవంతుడు తీసుకెళ్లి పోతే బాగుణ్ణు,నేను కుటుంబానికి భారం మొదలైనవి.

పైన చెప్పిన లక్షణాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా మానసిక వైద్యుడిని కలవాలి, వారి సలహా ప్రకారం చికిత్స తీసుకోవాలి. స్వల్ప స్థాయిలో ఉన్న దిగులు సాధారణంగా ఆరు నుండి ఎనిమిది నెలలు ఉండేది, వైద్యం తీసుకుంటే రెండు మూడు నెలల్లో తగ్గుతుంది. అయితే కొన్నిసార్లు అది దీర్ఘకాలికము/ తీవ్రం కావచ్చు.

న్సిలింగ్ అంటే ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళు చేసేది, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఇంటర్ పర్సనల్ థెరపీ, సైకో డైనమిక్ సైకోతెరపీ ఇలా కొన్ని రకాలు ఉన్నాయి. వీటిలో ఏది అయితే మంచిది అన్నది వైద్యులు నిర్ణయిస్తారు.
అలాగే మందులు – యాంటీ డిప్రెస్సంట్ అంటారు, ఇవి చాలా రకాలు.

మందులు దీర్ఘ కాలికం కాదు, చాలామంది ఒకటి లేదా రెండు సంవత్సరాల తర్వాత ఆపేయ్యొచ్చు.
జీవన విధానంలో మార్పులు-మంచి ఆహారం, చక్కని నిద్ర, ఆల్కహాల్, ధూమపానం కి దూరంగా ఉండటం, వ్యాయామం మొదలైనవి.
గుర్తుపెట్టుకోండి-దిగులు సాధారణం, వైద్యం ఉంది, చికిత్స తీసుకోవటానికి ఎటువంటి బెరుకు అవసరం లేదు.