ఇండియా: తగ్గుతున్న కరోనా కేసులు.. రాష్ట్రాల్లో లాక్డౌన్ సడలింపులు ఇలా..

కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ సడలింపుల దిశగా వెళ్తున్నాయి. కరోనా మూడవ వేవ్ వస్తుందని నిపుణులు చెబుతున్నవిషయాలని దృష్టిలో ఉంచుకుని అనేక నియమ నిబంధనల మధ్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్డౌన్ సడలింపులు ఇస్తున్నాయి. ఏయే రాష్ట్రాల్లో సడలింపులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

మహారాష్ట్ర

5దశల అన్ లాక్ కార్యక్రమం సోమవారం మొదలయ్యింది. మొత్తం 36జిల్లాల్లో 18జిల్లాలు అన్ లాక్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాయి. వాటిల్లో ఔరంగాబాద్, బండారా, చంద్రపూర్, ధూలే, గడ్చిరోలి, గోండియా, జల్గావ్, జాల్నా, లాథూర్, నాగ్ పూర్, నాందేడ్, నాసిక్, పర్బని, థానే, వాషిం, వార్ధా ఇంకా యవత్మల్ ఉన్నాయి.

ఈ జిల్లాలు సాధారణ పరిస్థితుల్లో ఎలా పనిచేసాయో అలాగే పనిచేస్తాయి.

ఢిల్లీ

50శాతం సీటింగ్ సామర్థ్యంతో మెట్రో రైలు మొదలైంది. మాల్స్, మార్కెట్ ( వారాంతపు మార్కెట్లు మినహా) మొదలగునవన్నీ సరి బేసి విధానం ఉదయం 10గంటల నుండి రాత్రి 8గంటల వరకు ఓపెన్ అవుతున్నాయి. ప్రైవేటు ఆఫీసులు కేవలం 50శాతం సిబ్బందితో మాత్రమే పనిచేస్తాయి.

ఉత్తరప్రదేశ్

71జిల్లాల్లో లాక్డౌన్ సడలింపబడింది. ఆ జిల్లాల్లో కరోనా కేసులు 600కంటే తక్కువగా ఉన్నాయి.
600కంటే ఎక్కువ కేసులు ఉన్న జిల్లాలైన లక్నో, మీరట్, గోరఖ్ పూర్, షహరన్ పూర్ లో కర్ఫ్యూ విధించబడింది.

కంటైన్మెంట్ జోన్లు లేని ప్రాంతాల్లో దుకాణాలు ఓపెన్ చేసుకోవచ్చు. అది కూడా వారానికి ఐదు రోజులు మాత్రమే. వారాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతూ ఉంటుంది.

తమిళనాడు

కోవై, నిల్గీరీస్, తిరుప్పూర్, సేలం, కరూర్, నమక్కల్, తంజావూర్, నాగపట్టినం, మయిలదుతురై సహా మొత్తం 11జిల్లాల్లో లాక్డౌన్ యధావిధిగా కొనసాగుతుంది. లాక్డౌన్ సడలింపులు ఉన్న జిల్లాల్లో దుకాణాలు సహా కూరగాయల షాపులు ఉదయం 6గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు ఓపెన్ చేసుకోవచ్చు.

హర్యానా

రెస్టారెంట్లు, హోటళ్ళు, బార్లు ఉదయం 10నుండి రాత్రి 8గంటల వరకు ఓపెన్ చేసుకోవచ్చు. హోటళ్ళ నుండి హోమ్ డెలివరీకి రాత్రి 10గంటల వరకు అనుమతి. ఫంక్షన్ హాళ్ళలో పెళ్ళీళ్ళు చేసుకోవచ్చు. బారాత్ వంటి కార్యక్రమాలకు అనుమతి లేదు.

ఉత్తరాఖండ్

జూన్ 9వ తేదీ నుండీ 14వరకు జనరల్ స్టోర్స్ అన్నీ ఉదయం 8నుండి మధ్యాహ్నం 1వరకు ఓపెన్ చేసుకోవచ్చు. వారంలో రెండు రోజులు మాత్రమే రిటైల్ షాప్స్ తెరుచుకోవచ్చు.