నిద్ర పట్టడానికి టెక్నిక్స్ ఉన్నాయి.. తెలుసుకోండి..

నిద్ర.. ఆరోగ్యంగా ఉండడానికి సరైన నిద్ర చాలా అవసరం. ఐతే ఎంతసేపు పడుకున్నామనే దానికంటే ఎంత బాగా నిద్రపోయామన్నదే లెక్కలోకి వస్తుంది. రోజూ ఎనిమిది గంటలు బెడ్ పైనే ఉన్నా కూడా సరైన నిద్ర రాక ఆలోచిస్తూనే ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే నిద్రపోయినా కూడా మధ్యలో రెండు మూడుసార్లు లేచి నిద్రాభంగం కలిగించుకునే వాళ్ళు కూడా చాలామంది. ఇలాంటి నిద్ర అవస్థల నుండి బయటపడి చక్కగా నిద్రపోవడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి.

మొదటగా, నిద్రపోయే నాలుగు గంటల ముందు కాఫీ, టీలు తాగడం మానేయండి. కాఫీలో ఉండే కెఫిన్ నిద్రని దూరం చేస్తుంది. కొందరికైతే డే టైమ్ లో కాఫీ తాగినా రాత్రి టైమ్ లో సరిగా నిద్ర రాదు. అలాంటి వాళ్ళు కాఫీ తాగడం పూర్తిగా మానేయడమే మంచిది.

సెల్ ఫోన్ వాడకం…

రాత్రి సెల్ ఫోన్ వాడటం మానేయండి. మొబైల్ ఫోన్ నుండి వచ్చే నీలికిరణాలు కంటిపై పడి నిద్రని దూరం చేస్తాయి. అందుకే రాత్రిపూట ల్యాప్ టాప్, మొబైల్స్ వాడకపోవడం ఉత్తమం.

పుస్తకాలు చదవాలి..

చిన్నపిల్లలు పుస్తకం ముందు పెట్టుకుని కూర్చోగానే నిద్రపోతారు. అలాంటి అలవాటు చాలామందికి ఉంటుంది. నిద్ర రాకపోతే పుస్తకం చదవడం మంచి అలవాటు. ఐతే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనసు మీద బలమైన ముద్ర వేసే పుస్తకాలు చదవకూడదు.

అంకెలు లెక్కపెట్టడం..

ఇది బాగా పనిచేస్తుంది. వంద నుండి రివర్స్ లో ఒకటి వరకూ లెక్కపెడుతూ ఉంటే నిద్ర బాగా వస్తుంది.

ధ్యానం, ఎక్సర్ సైజ్..

శారీరక శ్రమ లేకపోతే శరీరం అలసట చెందదు. అలసట చెందని శరీరం నిద్రకి ఉపక్రమించదు. అందుకే ఎక్సర్ సైజ్ తప్పనిసరిగా చేయాలి. అలాగే ధ్యానం చాలా బాగా వర్కౌట్ అవుతుంది.

తినే అలవాట్లు మార్చుకోవాలి.

రాత్రిపూట ఎక్కువ తినకూడదు. ఆహారం అధికంగా తీసుకోవడం వలన నిద్రపోయే సామర్థ్యం దెబ్బతింటుంది.

ఈ అలవాట్లని ఒకసారి ప్రయత్నించండి. ఆ తర్వాత మార్పుని మీరే గమనిస్తారు.