సెక్స్ లైఫ్ లో మిమ్మల్ని ఈ భయాలు వెంటాడుతున్నాయా.. ?

కొందరు శృంగారాన్ని ఓ పనిలా భావిస్తుంటారు. సెక్స్ ను ఎంజాయ్ చేయకుండా ఏదో ప్రూవ్ చేయాలనుకుంటారు. కనీసం వారి పార్ట్ నర్ ఇష్టాయిష్టాలేంటో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించరు. సెక్స్ గురించి వాళ్లతో మాట్లాడానికి ఇష్టపడరు. వీరికి ఉండే కొన్ని భయాల వల్ల సెక్స్ లైఫ్ ను ఎంజాయ్ చేయలేకపోతారు. ముఖ్యంగా ఇలాంటి భయాలు ఎక్కువగా మహిళల్లోనే ఉంటాయని ఓ సర్వేలో తేలింది. ఇంతకీ ఆ భయాలేంటి..? వాటి నుంచి బయటపడేదెలా..?

 

పెళ్లైన కొత్తలో చాలా మంది ఆడవాళ్లు సెక్స్ చేసే సమయంలో వచ్చే నొప్పి గురించి భయపడతుంటారు. ఈ భయం వల్ల భార్యాభర్తలు లైంగిక జీవితం గురించి ఒకరి మనసులో దాగున్న ఆలోచనలు, కోరికలు నిర్మొహమాటంగా పంచుకోలేకపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ అడ్డు తెర తొలగిపోవాలంటే.. నొప్పి రాకుండా ఉండేందుకు తగిన ప్రత్యామ్నాయాల గురించి అన్వేషించాలని సూచించారు. లూబ్రికెంట్లు, జెల్స్‌, మాయిశ్చరైజర్లు.. వంటివి నిపుణుల సలహా మేరకు ఉపయోగించాలని చెప్పారు.

పెళ్లైనా అప్పుడే పిల్లలొద్దు అనుకునే వాళ్లు కొందరుంటారు. ఇలాంటి వారు సెక్స్ లో పాల్గొనడానికి ఆలోచిస్తుంటారు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తుందేమోనని భయపడుతుంటారు. దీనివల్ల వారు శృంగారాన్ని ఆస్వాదించలేకపోయారు. ప్రస్తుతం అవాంఛిత గర్భం ధరించకుండా ఉండేందుకు బోలెడన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. గర్భ నిరోధక మాత్రలు, సాధనాలు.. వంటివి అందులో కొన్ని! నిపుణుల సలహా మేరకు వీటిని ఉపయోగిస్తే సరిపోతుంది. ఇదేమీ కొత్త విషయం కాకపోయినా.. వీటిని ఉపయోగిస్తూ కూడా.. ఇవి సరిగ్గా పనిచేస్తాయో, లేదోనన్న సందేహంతో శృంగారంలో పాల్గొనడానికి భయపడే వారూ లేకపోలేదు. ఇలాంటి వారు మీ రుతుచక్రాన్ని బట్టి అండం విడుదలయ్యే రోజుల్ని లెక్కించి.. ఆ సమయంలో దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

శృంగార జీవితానికి, వ్యక్తిగత పరిశుభ్రతకు దగ్గరి సంబంధం ఉంది. కొంతమంది వ్యక్తిగత పరిశుభ్రతకు అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. దీనివల్ల ఆలుమగల మధ్య దూరం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పరిమళాలు వెదజల్లే నూనెల్ని నీటిలో కలుపుకొని స్నానం చేయడం, జననేంద్రియాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, శృంగార సామర్థ్యాన్ని, లైంగిక కోరికల్ని పెంచే ఆహారానికి ప్రాధాన్యమివ్వడం, పడకగదిలో అరోమా క్యాండిల్స్‌ ఏర్పాటు చేసుకోవడం.. వంటివన్నీ ముఖ్యమే.

కలయిక ద్వారా కొన్ని రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశాలు ఎక్కువని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు, హెచ్‌ఐవీ.. వంటి ప్రాణాంతక వ్యాధులు దంపతుల్ని లైంగిక జీవితానికి దూరం చేస్తున్నాయి. లైంగిక చర్యలో పాల్గొనేటప్పుడు పలు సురక్షిత పద్ధతులు పాటించడం, ఆయా వ్యాధులు/ఇన్ఫెక్షన్లు సోకకుండా నిపుణుల సలహా మేరకు వ్యాక్సిన్లు వేయించుకోవడం.. వంటి వాటి వల్ల ముప్పు తగ్గే అవకాశం ఉంటుంది.