ధ్యానం ఎలా చేయాలి? కోవిడ్ టైమ్ లో ఒత్తిడి నుండి ఎలా దూరం కావాలో తెలుసుకోండి..

-

కోవిడ్ కారణంగా ప్రతీ ఒక్కరికీ ఒత్తిడి పెరిగిపోయింది. లాక్డౌన్ వల్ల పని లేకపోవడంతో ఏం చేయాలి? ఇల్లు ఎలా గడవాలి అనే విషయంలో తీవ్ర ఒత్తిళ్ళకి గురయ్యారు. ఇంకా అవుతున్నారు కూడా. దీంతో మెదడుపై దుష్ప్రభావం పడి అది యాంగ్జయిటీకి దారి తీసి అనేక ముప్పుల్ని తెచ్చి పెడుతుంది. మరి దీన్నుండి ఎలా బయటపడాలి? బయట పరిస్థితులు బాగా లేకున్నా, భవిష్యత్తులో బాగుంటుందన్న నమ్మకంతో ఈ రోజు ఒత్తిడి లేకుండా ఎలా గడపాలనేది ఎవ్వరికీ అర్థం కాకుండా ఉంది.

దానికి ధ్యానం ఒక్కటే మార్గం అని చాలా మంది నమ్ముతున్నారు. ఐతే అలా నమ్మిన వాళ్ళు కూడా ధ్యానం ఎలా చేయాలో తెలియక, దానివల్ల వచ్చే ఫలితాలను అందుకోలేకపోతున్నారు.

ధ్యానం చేయడం అంటే ఏమిటి?

ఈ ప్రశ్నకి సమాధానం తెలియని వాళ్ళు ఇంకా ఉన్నారు. ఒకే పని మీద దృష్టంతా నిలపడమే ధ్యానం. అవును, మీరే పని చేస్తున్నా, అదే పనిమీద మీ ఆలోచన నిలిస్తే దాన్నే ధ్యానం అంటారు. ఒకే పని మీద మీరనుకున్నంత సేపు ధ్యాస నిలుపుతున్నారంటే మీరు ధ్యానం చేస్తున్నట్టే. ధ్యాస ఒక దగ్గర నిలిపితే ధ్యానం సాధ్యం అవుతుంది. చాలా మందికి తాము చేసే పనిలో ధ్యానం చేయడం వీలు కాకపోవచ్చు. అందుకే కొంచెం టైమ్ తీసుకుని ధ్యానం చేయాల్సి ఉంటుంది.

అలాంటి వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన స్థలాల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ మనసుని డిస్టర్బ్ చేయని ప్రదేశమైతే బెటర్. ధ్యానం చేసేటపుడు మీరు కూర్చునే విధానం నిటారుగా ఉండాలి. మీరు ధ్యాస నిలిపే ఒక మంత్రమో, విషయమో తలచుకోండి. అది కాదంటే మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీకెన్ని ఆలోచనలు వచ్చినా రానివ్వండి. వాటి మీద ఇది కరెక్ట్ అది కరెక్ట్ అంటూ జడ్జ్ చేయకండి.

ఇలా రోజూ ఒక ఐదు నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ధ్యానం మీకు అలవాటుగా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news