శీతాకాలంలో ఫిట్‌నెస్ కోసం.. ‘యోగాసనాలు’

-

శీతాకాలంలో మన శరీరం చలికి ఒంగిపోతుండటం గమనిస్తూనే ఉంటాం. ప్రత్యేకంగా ధనుర్మాసం ప్రారంభమైతే మన శరీరం ధనస్సులా చలికి ముడుచుకుపోతుందని ఇంటి పెద్దలు చెబుతూనే ఉంటారు. అదే సంక్రాంతికి అయితే చేతులు పైకి కూడా లేపని పరిస్థితి ఉంటుంది. వాతావరణం చల్లగా ఉండటం.. గతేడాది వర్షాలు, తుఫాన్లు ఎక్కువగా వీచడంతో ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అంచనా.

శీతాకాలంలో సహజంగా బయట అడుగు పెట్టాలంటే చాలా మంది ఆలోచిస్తుంటారు. పొద్దెక్కినా చలికి ముడుచుకుని పడుకుంటారు. ఒకే చోట కూర్చోవడం వల్ల బద్దకం ఎక్కువగా తయారీ చలిని తట్టుకోవడం ఇబ్బందిగా మారుతుంది. అందుకే రోజువారీ పనులు చేస్తూ హుషారుగా ఉండాలి. రోజూ ఇంట్లోనే ఉంటూ యోగాసనాలు వేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ వేగాన్ని పెంచుకోవచ్చు. దీని ద్వారా శరీర ఉష్ణోగ్రత పెరిగి చలిని తట్టుకోగలరు. చలిని తట్టుకోవడానికి కొన్ని యోగాసనాలు ఉన్నాయి.

మార్జరియాసనం..

మార్జిరియాసనం లేదా బిటిలాసనం (క్యాట్ కౌ) ఆసనాన్ని వేయడం వల్ల శరీరం అలసటను దూరం చేసుకోవచ్చు. కొద్దిసేపటి వరకు చేతులు, కాళ్లపై శరీర భారాన్ని మోస్తే మీ వెన్నెముక మేల్కొంటుంది. ఉదయం లేవగానే ఈ ఆసనాన్ని వేయడం వల్ల రాత్రంతా చలికి ముడుకుపోయిన మీ శరీరం.. రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు వీలు పడుతుంది.

సూక్ష్మ వ్యాయామం..

కీళ్లలో చురుకుదనం పెంచేందుకు, కీళ్లు పట్టేసినప్పుడు ఈ ఆసనాన్ని వేయడం ఎంతో మేలు. చలికాలంలో చేతులు, వేళ్లు, మోకాళ్లు, మోచేతులు చలికి ముడుచుకుపోతాయి. రోజూ 10 నుంచి 15 నిమిషాలపాటు ఈ ఆసనాన్ని వేయడం వల్ల శరీరంలోని పంచేంద్రియాలను మేల్కొలుపుతుంది. మెదడును రీఫ్రెష్ చేసే శక్తి దీనికి ఉంటుంది. మెడ భాగాన్ని నాలుగు దిక్కులా కదిలించడం, మోచేయిని రౌండ్ గా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తిప్పడం, నిటారుగా నిలబడి కూర్చొని లేవడం మంచి ఫలితాన్ని ఇస్తాయి.

పార్వ్శోత్తాసనం..

శరీరాన్ని పూర్తిగా వంచడం వల్ల వెన్నెముక మెరుగ్గా పనిచేస్తుంది. చేతులు, కాళ్లు బాగా సాగదీస్తూ శరీరాన్ని 45 డిగ్రీలకు వంచి 30 సెకండ్ల పాటు చేయాలి. ఈ యోగాను కుడి, ఎడమవైపు రిపీట్ చేయండి.

అధో ముఖో స్వనాసన..

భూమిపై చేతులు, కాళ్లు ఆనించి.. మీ నడుమును ఎంత వీలైంత అంత పైకి లేపడం వల్ల చేతులు, భుజాలు, వెన్నెముక, నడుమును బాగా వంచేలా చేస్తే బద్ధకాన్ని పొగొట్టొచ్చు. 30 సెకండ్లపాటు గ్యాప్ ఇచ్చి ఈ వ్యాయామాన్ని చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.

భుజంగాసన..

శరీరాన్ని పాములా వంచితే బిగుసుకుపోయిన అవయవాలన్నీ నిద్రలేస్తాయి. భుజంగాసనంతో శ్వాసకోశ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అరచేతిని భూమిపై ఆనించి ఈ యోగా ముద్రతో రిలాక్స్ అవ్వాలి. అలా చేస్తే శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా మల్చుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news