కాలుకు నొప్పి ఉన్నా మూడు కిలోమీటర్లు పరిగెత్తి రైలు ప్రమాదాన్ని తప్పించాడు..!

-

మనిషన్నాక కాసింత మానవత్వం ఉండాలి. మన కోసమే కాదు పది మంది కోసం బతకాలి అంటారు పెద్దలు. దాన్ని నిజం చేశాడు ఈ వ్యక్తి. ఈయన చేసిన సాహసం వేల మంది ప్రాణాలను కాపాడింది. ఈయన దగ్గర డబ్బులు లేకపోవచ్చు. కానీ.. మంచి మనసు ఉంది.. అదే ఆయన్ను ఇప్పుడు హీరోను చేసింది.

కృష్ణ పూజారి అనే వ్యక్తి కర్ణాటకలోని ఉడిపి జిల్లాకు చెందినవాడు. కొరంగ్రపాడిలో ఓ హోటల్ లో పనిచేస్తాడు. ఆయితే కొన్ని రోజులుగా ఆయనకు ఆరోగ్యం బాగుండట్లేదు. కుడి కాలు చచ్చుబడిపోయింది. ఎన్నిసార్లు వైద్యం చేయించినా ఫలితం లేదు. డబ్బులు లేక వైద్యం చేయించడం కూడా మానేశాడు. డాక్టర్ల సలహా మేరకు రోజు ఉదయం బ్రహ్మస్తన నాగబాన ప్రాంతంలో నడిచేవాడు.

పట్టాల పక్కన ఉన్న గులకరాళ్లపై రోజూ నడిచేవాడు. అలా నడిస్తే కాలులో చలనం వస్తుందని రోజూ ఆ ప్రాంతంలో పట్టాల పక్కన నడిచేవాడు. రోజూలాగే గత శనివారం కూడా ఉదయమే నాగబాన ప్రాంతానికి వెళ్లాడు. రైలు పట్టాల పక్కనుంచి నడుస్తున్నాడు. ఎందుకో రైలు పట్టాలను గమనిస్తూ ప్రశాంతంగా గాలిని పీల్చుతూ నడుస్తూ వెళ్తున్నాడు. ఇంతలోనే పట్టా విరిగిపోయినట్టు కనిపించింది. ఒక్కసారిగా ఆగాడు. కళ్లను ఓసారి తుడుచుకొని మళ్లీ చూశాడు. నిజమే.. పట్టా విరిగిపోయింది. ఇంకాసేపట్లో అదే ట్రాక్ మీది నుంచి గోవా ఎక్స్ ప్రెస్ వెళ్తుంది. వామ్మో.. ట్రెయిన్ గనుక ఆ ట్రాక్ మీది నుంచి వెళితే ఇంకేమన్నా ఉందా? ట్రెయిన్ లోని వేల మంది ప్రయాణికుల పరిస్థితి ఏంటి అని ఆలోచించాడు. అంతే.. ఇక పరిగెత్తడం ప్రారంభించాడు. చచ్చుబడిపోయిన కాలు పరిగెత్తడానికి సహకరించకున్నా తన శక్తినంతా కూడదీసుకొని పరిగెత్తడం ప్రారంభించాడు. అలా ఓ అర్ధగంటలో ఏకంగా మూడు కిలోమీటర్లు పరిగెత్తాడు. చెమటలు కక్కుతూ అక్కడ ఉన్న ఇంద్రాలి స్టేషన్ లోకి వెళ్లాడు. స్టేషన్ మాస్టర్ కు రైలు పట్టా విరిగిపోయిన సంగతి చెప్పాడు.

వెంటనే అధికారులు అప్రమత్తమై…ఇంద్రాలి స్టేషన్ కు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ట్రెయిన్, పడుబిడ్రి స్టేషన్ కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ట్రెయిన్ ను ఆపేశారు. వెంటనే అక్కడికి వెళ్లి రైలు పట్టాను మరమ్మతు చేసి సెట్ చేశారు. తర్వాత రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి, కాలు నొప్పిపెడుతున్నా పట్టించుకోకుండా పరిగెత్తి వచ్చి విరిగిపోయిన పట్టా గురించి సమాచారం అందించిన కృష్ణను రైల్వే అధికారులతో పాటు అక్కడి స్థానికులు ప్రశంసల్లో ముంచెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news