గ్రేట్.. 80 మంది ప్రాణాలను కాపాడిన జేసీబీ డ్రైవర్‌

ఈ వ్యక్తి సోషల్ మీడియాలోనే కాదు కేరళలోనూ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఆయన చాకచక్యం కనీసం 80 మంది ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన కేరళలోని ఎరచ్చిపార వద్ద చోటు చేసుకున్నది. రాజక్కాడ్ కు వెళ్తున్న బస్సు ఎరచ్చిపార వద్దకు చేరుకోగానే అదుపుతప్పింది. ఆ బస్సులో 80 మంది దాకా ప్రయాణిస్తున్నారు. అదుపు తప్పిన బస్సు రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లబోయింది. ఇంతలో అక్కడే ఉన్న కపిల్ అనే వ్యక్తి బస్సు అదుపు తప్పడాన్ని గమనించాడు. వెంటనే తన జేసీబీని అక్కడికి తీసుకెళ్లి జేసీబీ హ్యాండిల్ తో బస్సును లోయలో పడకుండా ఆపాడు. వెంటనే బస్సులో ఉన్న ప్రయాణికులు బతుకు జీవుడా అంటూ బస్సు నుంచి కిందికి దూకేశారు. వెంటనే స్పందించిన స్థానికులు.. బస్సును లోయలో పడకుండా రోడ్డు మీదికి లాగారు.

ఇక.. 80 మంది ప్రాణాలను కాపాడిన కపిల్ కు సంబంధించిన పోటోలను అతడి ఫ్రెండ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో అతడి గురించి ప్రపంచానికి తెలిసింది. నెటిజన్లయితే మనోడి దైర్యం, సాహసం, చాకచక్యానికి మెచ్చుకొని రియల్ హీరో అంటూ తెగ పొగిడేస్తున్నారు.