కోడలుకు కిడ్నీ దానం చేసి మానవత్వాన్ని చాటుకున్న అత్త…!

అత్తాకోడళ్లు అంటే ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. ప్రతి రోజు ఏదో ఒక నెపంతో అత్త కోడలును తిడుతూనే ఉంటుంది. కోడలు తన భర్తతో అత్త మీద లేనిపోనివి నూరిపోస్తూనే ఉంటుంది. అలా ఉంటేనే వాళ్లు అత్తాకోడళ్లు అవుతారు. ఇంకా కొంతమంది అత్తాకోడళ్లయితే ఇంకాస్త ముందుకెళ్లి జుట్లు పట్టుకొని వీర బాదుడు బాదుకుంటారు. తిట్టుకుంటారు. కొట్టుకుంటారు.. ఒకరికి మరొకరు బద్ధశత్రువుల్లా మారిపోతారు. జీవితాంతం అత్తాకోడళ్లు ఇక అంతే అని అందరూ వాళ్లను పట్టించుకోవడం మానేస్తారు.

కానీ.. ఈ అత్త చూడండి.. సొంత బిడ్డను కూడా కాదనుకునే ఈరోజుల్లో కోడలుకు తన కిడ్నీని దానం చేసి అందరి ప్రశంసలు అందుకుంటోంది. మానవత్వాన్ని చాటుకుంది. రాజస్థాన్ లోని బాడ్మేర్ లో ఉన్న గాంధీనగర్ కు చెందిన గోనీదేవీ అనే అత్తే తన కిడ్నీని కోడలుకు దానం చేసింది. తన కోడలు సోనికాకు గత సంవత్సరం నుంచి రెండు కిడ్నీలు పనిచేయట్లేవు. దీంతో వారానికి ఓసారి డయాలిసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. కిడ్నీ మార్పిడి చికిత్స తప్పించి వేరే మార్గం లేదని డాక్టర్లు చెప్పేశారు. దీంతో కిడ్నీ దాత కోసం సోనికా తిరగని గడప లేదు. కన్న తల్లి, సోదరుడు కూడా కిడ్నీ ఇవ్వమని నిరాకరించారు. దీంతో ఏం చేయాలో తెలియనిస్థితిలో ఉన్న సోనికాకు దేవతలా అత్త గోనీదేవీ కిడ్నీ ఇస్తానని ముందుకొచ్చింది. గోనీదేవీ నిర్ణయానికి ముందు కుటుంబ సభ్యులంతా షాక్ అయినా.. తర్వత తేరుకొని ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు. దీంతో ఇటీవలే డాక్టర్లు సోనికాకు కిడ్నీ మార్పిడి సర్జరీ చేశారు. విజయవంతంగా ఆపరేషన్ ముగియడం… గోనీదేవి తన కోడలుకు పునర్జన్మ ప్రసాదించడంతో గోనీదేవి కుటుంబ సభ్యులు, స్థానికులు తనను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. అత్తకు మరో భాష్యం చెప్పావు.. అత్తంటే ఎప్పుడు కోడలు మీద ఆడిపోసుకునేదే అనే అర్థాన్ని నువ్వు తిరగరాశావు.. అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు.