అమ్మ గ్రూప్ 4 పరీక్ష రాస్తోంది.. బిడ్డను పోలీసులు లాలించారు..!

మీకు గుర్తుందా.. నిన్న గాక మొన్ననే అనుకుంటా? కానిస్టేబుల్ పరీక్ష సమయంలో ఓ పాప గుక్క పెట్టి ఏడుస్తుంటే ఓహెడ్ కానిస్టేబుల్ ఆ పాపను లాలించాడు. ఆ కానిస్టేబుల్ చేసిన పనికి మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో తెగ ప్రశంసలు కూడా వచ్చాయి…

తాజాగా.. ఇవాళ జరిగిన గ్రూప్ ఫోర్ పరీక్షలో మరో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. మళ్లీ పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. మాలో కర్కశత్వమే కాదు.. మంచితనం కూడా ఉంటుందని నిరూపించారు. వాళ్లే సికింద్రాబాద్ లోని మహంకాళి పోలీసులు. గ్రూప్ 4 పరీక్ష సందర్భంగా సెంటర్ల వద్ద వాళ్లకు డ్యూటీ పడింది. ఓ సెంటర్ లో తమ విధులు నిర్వర్తిస్తున్నారు. చిన్న పిల్లలను లోపలికి అనుమతించరు కదా. అందుకే తన పాపను వరండాలో పడుకోబెట్టింది.. నిద్రపుచ్చిన తర్వాత పరీక్ష రాయడానికి వెళ్లింది ఓ తల్లి. కానీ.. ఇంతలోనే ఆ చిన్నారి లేచి గుక్కపెట్టి ఏడ్వడంతో ఆ చిన్నారిని గమనించిన పోలీసులు అక్కడికి చేరుకొని ఆ పాపను లాలించడానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పాలడబ్బాతో పాలు పట్టారు. అమ్మ పరీక్ష రాసి వచ్చేదాకా.. ఆ చిన్నారి ఆలనాపాలనా చూశారు. ఈక్రమంలో ఓ వ్యక్తి ఆ పోలీసుల ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు.. ఆ ఫోలీసులకు సలామ్ కొడుతున్నారు.