Success Story: 1200 స్కూళ్ళని స్థాపించి అందరికి ఆదర్శంగా నిలుస్తున్న వికలాంగుడు!

-

సొసైటీలో వికలాంగులు అంటే కొందరికి చిన్న చూపు ఉంటుంది. మరి కొందరికి సానుభూతి ఉంటుంది. పాపం వాళ్ళు ఏమి చేయలేరని జీవితంలో ముందుకు వెళ్ళలేరని వాళ్ళ కుటుంబానికి అండగా ఉండలేరని కుటుంబానికి భారం అని చాలా మంది అనుకోవడం సర్వ సాధారణం. కానీ జీవితంలో ఏదైనా సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదని పట్టుదలతో ముందుకు వెళితే లైఫ్ లో సక్సెస్ అవ్వవచ్చని చాలా మంది నిరూపించారు. అలాంటి వారిలో అజయ్ గుప్తా ఒకరు.

బచ్‌పన్ స్కూల్స్ అధినేత అజయ్ గుప్తాకి తన తొమ్మిది నెలల వయసులో పోలియో సోకడంతో ఆయన కాళ్లు నడుము కింది భాగంలో పనికిరాకుండా పోయాయి.వైద్యం కోసం ఆయన కుటుంబం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ కాలంలో వైద్యపరమైన పరిష్కారాలు అంతగా లేకపోవడంతో ఆయన కాళ్లు చచ్చుబడిపోయాయి. అయితే ఆయన అంతటితో ఆగపోకుండా దేశవ్యాప్తంగా ఏకంగా 1200 ‘బచ్‌పన్’ పాఠశాలలని స్థాపించి తన లాంటి వారికే కాకుండా అందరికీ కూడా ఎంతో ఆదర్శంగా నిలిచారు. ఓ గవర్నమెంట్ టీచర్ అజయ్ గుప్తా తాత గారి స్వీట్ షాప్‌కు వచ్చినప్పుడు అజయ్ పరిస్థితి గురించి తెలుసుకుని శారీరక వైఫల్యం అనేది చదువుకు ఏమాత్రం అడ్డుకాదని అవగాహన కల్పించారు. కేవలం చదువుతోనే ఆయన జీవితం మారుతుందని కుటుంబ సభ్యులను ఒప్పించి పాఠశాలలో చేర్పించారు.

కుటుంబ సభ్యులు అజయ్ గుప్తాను ప్రోత్సహించాలని నిర్ణయించుకుని ఆయన్ని తమ భుజాలపై మోసుకుని స్కూల్‌కు తీసుకెళ్లేవారు. మూడవ తరగతిలో తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించిన అజయ్ గుప్తా అప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ తన చదువును మాత్రం ఏమాత్రం ఆపకుండా కొనసాగించాడు. ఆయన వీల్ చైర్‌లో పాఠశాల, కళాశాలకు వెళ్లి చదువుకున్నారు.అయితే చదువుకున్నాకా వ్యాపార రంగంపై ఉన్న ఆసక్తితో గుప్తా హార్డ్‌వేర్ వ్యాపారం చేశారు. కానీ అది విజయవంతం కాలేదు. అయినా కానీ వెనక్కి తగ్గకుండా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రారంభించారు. చాలా నగరాల్లో విజయవంతమైన కంప్యూటర్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ లను స్థాపించారు.

అయితే ప్రభుత్వ కళాశాలలు కంప్యూటర్ విద్యను అందించడం ప్రారంభించినప్పుడు అజయ్ గుప్తా వ్యాపారానికి పెద్ద దెబ్బ తగిలింది. అయితే అజయ్ గుప్తా తన కుమార్తె కోసం మంచి ప్లే స్కూల్ కోసం వెతుకుతున్నప్పుడు మంచి స్కూల్స్ లేవని గ్రహించి ‘బచ్‌పన్’ స్టార్ట్ చేశారు. అలా 2004వ సంవత్సరంలో ‘ఎస్‌కే ఎడ్యుకేషన్స్’ని స్థాపించి, ‘బచ్‌పన్’ స్కూల్ చెయిన్‌కు పునాది వేశారు. ప్రస్తుతం 1200 ‘బచ్‌పన్’ ప్లే స్కూల్ ఫ్రాంచైజీలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. కాళ్లు లేని వికలాంగుడు అజయ్ గుప్తా తనకు కాళ్ళు లేవని ఏమాత్రం క్రుంగిపోకుండా ఎంతో మంది విద్యార్థులు తమ కాళ్లపై నిలబడేందుకు సహకారం అందించి నేడు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news