ఆ షాపులో ఎవ‌రూ ఉండ‌రు.. సరుకుల‌ని కొనుక్కుని బాక్సులో డ‌బ్బు వేయాలి.. ఎందుకో తెలుసా..?

-

అది ఒక కిరాణా షాపు.. కానీ చూస్తే మాత్రం అందులో అమ్మేవారు ఎవ‌రూ ఉండ‌రు. కొనుగోలుదారులు త‌మ‌కు కావ‌ల్సిన సరుకుల‌ను తీసుకుని వాటికి త‌గిన మొత్తాన్ని అక్క‌డే ఉండే ఓ బాక్సులో వేస్తారు. ఏంటీ.. వినేందుకు చాలా ఆశ్చ‌ర్యంగా ఉందా ? అయినా ఇది నిజ‌మే. ఇంత‌కీ అస‌లు ఆ షాపు క‌థేంటి.. అంటే..? కేర‌ళ‌లోని క‌న్నూర్ అనే ప్రాంతంలో ఉన్న అజికోడ్ అనే గ్రామంలో ఆ షాపు ఉంది. దానికి ఓ స్పెషాలిటీ ఉంది. అదేమిటంటే..

క‌న్నూర్‌లోని ఆశ్ర‌య స్పెష‌ల్ స్కూల్ లో చాలా మంది విక‌లాంగులు ఉంటున్నారు. వారు ఎవ‌రిపై ఆధార‌ప‌డ‌కుండా ప‌లు ర‌కాల వ‌స్తువుల‌ను త‌యారు చేసి అమ్మ‌డం ప్రారంభించారు. టాయిలెట్ క్లీన‌ర్లు, స‌బ్బులు, అగ‌ర్‌బ‌త్తీలు లాంటివ‌న్న‌మాట‌. అయితే మొద‌ట్లో వారి వ‌స్తువుల‌కు అంత‌గా అమ్మ‌కాలు ఉండేవి కావు. కానీ జ‌న‌శ‌క్తి చారిట‌బుల్ ట్ర‌స్ట్ అనే ఓ ఎన్‌జీవో వారికి స‌హ‌కారం అందించింది. అజికోడ్ గ్రామంలో ఓ షాపు ఓపెన్ చేశారు. అందులో ఆశ్రయ స్పెష‌ల్ స్కూల్‌కు చెందిన విక‌లాంగులు త‌యారు చేసిన వ‌స్తువుల‌ను అమ్మ‌డం ప్రారంభించారు. అయితే మొద‌టి రోజు నుంచే ఆ షాపుకు స్పంద‌న లభించింది. చాలా మంది ఆ షాపులో ఉన్న వ‌స్తువుల‌ను కొనుగోలు చేయ‌డం ప్రారంభించారు.

అలా షాపు విజ‌య‌వంతంగా నిర్వ‌హింప‌బ‌డుతుండే సరికి ఆ విక‌లాంగుల్లో ఎంతో ఉత్సాహం వ‌చ్చింది. వారు మరిన్ని వ‌స్తువుల‌ను త‌యారు చేసి అమ్మ‌డం ప్రారంభించారు. వారి నుంచి ట్ర‌స్టు ప్ర‌తినిధులు వ‌స్తువుల‌ను తీసుకుని షాపులో ఉంచుతారు. ఆ వ‌స్తువుల అమ్మ‌కం ద్వారా వ‌చ్చిన డ‌బ్బును విక‌లాంగుల‌కు ట్ర‌స్టు స‌భ్యులు ఇచ్చేస్తారు. అలా షాపు ద్వారా రోజుకు రూ.1వేయి ఆదాయం వ‌స్తోంది. ఇక షాపులో వ‌స్తువుల‌ను అమ్మేందుకు ఎవ‌రూ ఉండ‌రు. కొనుగోలుదారులే షాపుకు వ‌చ్చి త‌మ‌కు కావ‌ల్సిన వ‌స్తువుల‌ను తీసుకుని అందుకు అయ్యే డ‌బ్బుల‌ను అక్క‌డి బాక్స్‌లో వేస్తారు. మరి ఎవ‌రైనా చీటింగ్ చేస్తే ఎలా ? అంటే.. వారికి ఆ బెంగ లేదు. ఎందుకంటే.. ప‌క్క‌నే ఉండే ఇత‌ర షాపుల వాళ్లు చూస్తుంటారు క‌దా. దానికి తోడు ఆ షాపులో సీసీ కెమెరాల‌ను కూడా అమ‌ర్చారు. దీంతో షాపులో ఉన్న వ‌స్తువుల‌ను ఎవ‌రైనా కాజేస్తార‌న్న భ‌యం వారికి లేదు. ఇక ప‌క్క‌నే కూర‌గాయ‌లు అమ్ముకునే ఓ రైతు ఆ షాపును నిత్యం ఉద‌యాన్నే 6 గంట‌ల‌కు ఓపెన్ చేస్తాడు. అలా ఆ షాపు రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ఉంటుంది. త‌రువాత మూసేస్తారు. ఎప్ప‌టిక‌ప్పుడు షాపులో స‌రుకుల అమ్మ‌కం ద్వారా వ‌చ్చే డ‌బ్బులు విక‌లాంగుల‌కు చేరుతాయి.

అయితే ప్ర‌స్తుతం జ‌న‌శ‌క్తి చారిట‌బుల్ ట్ర‌స్ట్ కేవ‌లం ఆ ఒక్క షాపునే నిర్వ‌హిస్తోంది. కానీ రాబోయే రోజుల్లో దేశంలోని ఇత‌ర ప్రాంతాల్లో కూడా ఇలా విక‌లాంగుల‌కు స్వ‌యం ఉపాధి క‌ల్పించేందుకు ఆ ట్ర‌స్టు వారు షాపుల‌ను ఏర్పాటు చేసే ప‌నిలో ఉన్నారు. ఏది ఏమైనా ఇంత‌టి మంచి పని చేస్తున్నందుకు ఆ ట్ర‌స్టు వారిని నిజంగా అభినందించాల్సిందే క‌దా..!

Read more RELATED
Recommended to you

Latest news