రోడ్లపై వేసే చెత్తను తగ్గించేందుకు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చండీగడ్ మున్సిపల్ కార్పొరేషన్ రోడ్లపై చెత్త వేసే వారికి రూ.10వేల జరిమానా, ప్లాస్టిక్‌ను వాడే వారికి రూ.5వేల జరిమానా విధించడం ప్రారంభించారు.
మన దేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలో చూసినా.. రోడ్లపై చెత్త దర్శనమిస్తుంటుంది. వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. ఇక నగరాల విషయానికి వస్తే పారిశుధ్యం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది. ఈ క్రమంలోనే అపరిశుభ్రంగా ఉండే పరిసరాల వల్ల జనాలు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు కూడా. దీంతో రోజు రోజుకీ రోడ్లపై పేరుకుపోయే చెత్తను తొలగించడం ఆయా నగరాలకు చెందిన మున్సిపాలిటీలకు కూడా సమస్యగా మారింది.
అయితే రోడ్లపై వేసే చెత్తను తగ్గించేందుకు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చండీగడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఇకపై మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఈ క్రమంలోనే ఆ నగరంలో ఇప్పుడు రోడ్లపై చెత్త వేసే వారికి రూ.10వేల జరిమానా, ప్లాస్టిక్‌ను వాడే వారికి రూ.5వేల జరిమానా విధించడం ప్రారంభించారు. ఈ నిబంధన తాజాగా అమల్లోకి రాగా మొదటి రోజే పెద్ద ఎత్తున మున్సిపల్ సిబ్బంది జరిమానాలను వసూలు చేశారు.
చెత్త వేస్తే ఫైన్ నిబంధనను ప్రవేశపెట్టిన తొలి రోజే చండీగడ్ మున్సిపల్ సిబ్బంది మొత్తం 45 చలాన్లు విధించారు. వాటిల్లో 40 మందికి చెత్త రోడ్లపై వేసినందుకు ఒక్కొక్కరికి రూ.10వేల జరిమానా విధించగా, మరో 5 మందికి ప్లాస్టిక్ వాడినందుకు ఒక్కొక్కరికి రూ.5వేల జరిమానా విధించారు. జరిమానా అందుకున్న వారిలో హోటల్స్ యాజమాన్యాలే ఎక్కువగా ఉండడం విశేషం. అయితే తమ ఉద్దేశం జరిమానా విధించి డబ్బులు వసూలు చేయడం కాదని, నగరం పరిశుభ్రంగా ఉండాలన్నేదే తమ అభిమతమని చండీగడ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. మరి వారు అమలు చేస్తున్న ఈ విధానం ఎంత వరకు సత్ఫలితాలను ఇస్తుందో వేచి చూస్తే తెలుస్తుంది..!