ప్రస్తుత సమాజంలో మనిషి జీవితంలో స్మార్ట్‌ఫోన్ ఒక భాగమైపోయింది. ఫోన్ లేనిదే అడుగు కూడా బయట వేయడం లేదు. మెలకువగా ఉంటే చేతిలో, నిద్రపోతే పక్కలో ఫోన్ ఉండాల్సిందే. దీంతోపాటు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాల వాడకమూ ఎక్కువైపోతున్నాయి. అయితే స్మార్ట్‌ఫోన్ వినియోగం ఎక్కువవుతున్నకొద్దీ వచ్చే రోగాల సంఖ్య పెరగడంతో పాటు మనుషుల మధ్య సంబంధాలూ దెబ్బ తింటున్నాయన్నది నగ్న సత్యం.
ఇటీవల నిర్వహించన ఓ సర్వేలో స్మార్ట్‌ఫోన్లలోని కెమెరాలను అత్యధికంగా ఉపయోగించడం ద్వారా కంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. అలాగే అధ్యయనం ప్రకారం రోజుకు ఐదు గంటల కన్నా ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లను వాడితే ప్రమాదమని, గుండె జబ్బులు, డయాబెటిస్ తదితర అనారోగ్య సమస్యలకు గురి కావల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. 18 నుంచి 83 ఏళ్ల మధ్య వయసు గల వారు ఎక్కువమంది ఫోన్ చాలా ఎక్కువగా వాడుతున్నారని తేలింది.
అవసరానికి మించి ఫోన్ వాడకం వల్ల నిద్రలేమి, అలసట, పనిలో నిస్సత్తువ వంటి అవలక్షణాలు చోటు చేసుకుంటాయి. ఇవన్నీ ఫోన్ వల్ల వచ్చిన సమస్యలేనని ఈ సర్వే తేల్చింది. అదే విధంగా రోజుకు ఐదు గంటల కన్నా ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌ను వాడే విద్యార్థులు స్థూలకాయం భారిన పడే అవకాశం 42.6 శాతం వరకూ ఉందని, అదే విద్యార్థినులైతే 57.4 శాతం వరకూ స్థూలకాయం భారిన పడే అవకాశం ఉందని తేల్చారు. డయాబెటిస్, గుండెజబ్బులు వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక స్మార్ట్‌ఫోన్ల వాడకాన్ని వీలైనంత వరకూ తగ్గించడం చాలా మంచిది.