మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అన్నారు పెద్దలు. అంటే.. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయింప బడతాయన్నమాట. ఏ జంట కలసి కలకాలం కాపురం చేస్తుందో, ఎవరికి ఎవరు ముడిపెట్టబడి ఉన్నారో ఎవరూ చెప్పలేరు కదా. అందుకే కొందరు పెళ్లయ్యాక కొంత కాలానికి పలు కారణాల వల్ల విడాకులు తీసుకుని మరొకరికి జీవిత భాగస్వామి అయి జీవనం కొనసాగిస్తుంటారు. అయితే కొందరు మాత్రం పెళ్లయిన తరువాత చాలా త్వరగా విడాకులు తీసుకుంటారు. ఇందుకు అనేక కారణాలుంటాయి. ఈ క్రమంలోనే ఓ జంట కూడా పెళ్లయిన 3 నిమిషాలకే విడాకులు తీసుకుంది. అవును, మీరు విన్నది నిజమే. ఇంతకీ అసలు జరిగింది ఏమిటంటే…
కువైట్ చెందిన ఓ జంట తాజాగా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయ్యాక కేవలం 3 నిమిషాల్లోనే వారు విడిపోయారు. ఎందుకో తెలుసా… వరుడు వధువును స్టుపిడ్ అని అన్నాడట. అంతే.. దీంతో నన్నే అంత మాట అంటావా.. అంటూ ఆ వధువు నేరుగా స్థానిక జడ్జి వద్దకు వెళ్లి విడాకులు కోరింది. దీంతో అవాక్కవడం జడ్జి వంతైంది. అయితే ఆ న్యాయమూర్తి ఎంత సర్ది చెప్పినా ఆమె వినలేదు. దీంతో జడ్జి వారికి విడాకులు మంజూరు చేశారు.
కాగా ఆ కువైట్ జంట ఇలా విడిపోయిన వార్త ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే వధువును అనేక మంది మహిళలు అభినందిస్తున్నారు. మహిళలకు గౌరవం లేని చోట ఇలాగే జరుగుతుందని, చాలా మంచి పని చేశావని కొందరు మెచ్చుకుంటుంటే.. కొందరు మాత్రం ఆ చిన్న మాట పట్టుకుని ఇలా పెళ్లయిన 3 నిమిషాలకే విడాకులు తీసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవును మరి.. ఆత్మాభిమానం ఉన్న వారు ఎవరైనా ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా భరించలేరు కదా. అందుకే ఆ మహిళా అలా చేసింది. ఏది ఏమైనా ఇప్పుడీ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది..!