మనం రోజు వాడే పదాలే అయినా కార్పొరేట్ పరిభాషలో వాటికి అర్థాలు వేరే ఉంటాయి. అవి తెలిసినప్పుడు మనకు కొంచె క్రేజీగానే ఉంటుంది. అలాంటి కొన్ని పదాల గురించి ఈరోజు మీకోసం..
మూన్లైటింగ్ (moonlighting): వాస్తవంగా దీనర్థం చందమామ కాంతి. కానీ, కార్పొరేట్ పరిభాషలో దీనర్థం రెండో ఉద్యోగం చేయడమట. రాత్రి వేళ కంపెనీకి తెలీకుండా రెండో ఉద్యోగం చేయడం అనే అర్థంలో దీన్ని ప్రస్తుతం వాడుతున్నారు.
క్వైట్ క్విటింగ్ (Quiet Quitting): క్వైట్ క్విటింగ్ అంటే నెమ్మదిగా జారుకోవడం అని అర్థం. కానీ కార్పొరేట్ పరిభాషలో దీనికి వేరే మీనింగ్ ఉంది. అదే పని భారాన్ని తగ్గించుకోవడం. కేవలం.. తమ పాత్ర ఎంత వరకో అక్కడికి మాత్రమే పరిమితం కావడం. ముఖ్యంగా కొవిడ్ తర్వాత వ్యక్తిగతంగా, వృత్తిపరంగా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉద్యోగులు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.
ది గ్రేట్ రిజిగ్నేషన్ (The Great Resignation): ఆకర్షణీయ జీతాలు, ప్యాకేజీలు ఇస్తామని ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలు ప్రకటిస్తున్నా.. ఉద్యోగులు కొలువులు ధైర్యంగా వదిలేసి కొత్త మార్గాలను అన్వేషించడాన్ని ‘ది గ్రేట్ రిజిగ్నేషన్’ అంటారు. ఆ మధ్య రాజీనామాల పర్వం కొనసాగినప్పుడు ఈ పదం బాగా వినిపించింది.
లో హ్యాంగింగ్ ఫ్రూట్ (Low-hanging fruit): ఏదైనా లక్ష్యాన్ని, పనిని సులువుగా చేయొచ్చన్న ఉద్దేశంలో ఈ పదాన్ని వాడుతారు. ఎవరైనా సులువుగా అయిపోయే పనులను ఎంచుకున్నప్పుడు.. సాధారణంగా ఈ పదాన్ని వాడుతుంటారు.
బైట్ ద బుల్లెట్ (bite the bullet): కష్టమైన టాస్క్ను తీసుకోవాలని ఉద్యోగులకు సూచించేటప్పుడు ఈ పదాన్ని వాడుతారు.
గివ్ 110% (Give 110%): ఎవరైనా నూటికి నూరు శాతం చెయ్ అని చెబుతారు. కానీ కార్పొరేట్ పరిభాషలో ఒక పనిమీద అదనంగా దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పాలనుకుంటే ఈ పదాన్ని వాడుతుంటారు.
కోర్ కాంపిటెన్సీ (Core competency): వ్యక్తి లేదా కంపెనీ ప్రధాన సామర్థ్యం ఇదీ అని చెప్పే ఉద్దేశంలో కోర్ కాంపిటెన్సీ అనే పదాన్ని వాడుతారు. ‘వాహనం ప్రత్యేకతలను వినియోగదారులకు వివరించడం కోర్ కాంపిటెన్సీ’ అని ఎవరైనా చెబితే.. అది అతడి ప్రధాన సామర్థ్యం అవుతుందని అర్థం..
డ్రిల్ డౌన్ (Drill down): ఏదైనా విషయంలో మరింత లోతుల్లోకి వెళ్లాలనుకున్న సందర్భంలో ఈ పదాన్ని వాడుతారు. కంపెనీని సక్స్ అవడానికి లోతైన విశ్లేషణ అవసరం అన్న సందర్భంలో ఈ పదాన్ని వినియోగిస్తారు.
నీ డీప్ (Knee deep): మోకాలి లోతు నీటిలో ఉన్నామని దీనర్థం. కానీ కార్పొరేట్ పరిభాషలో ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నాం అని చెప్పడానికి ఈ పదం వాడతారు.