నేను చిన్నప్పుడు చేసిన తప్పులను ఒప్పుకుంటూ నా తండ్రికి ఉత్తరం రాశా..!

-

గాంధీజీ గురించి.. ఆయన వ్యక్తిత్వం గురించి.. ఆయన జీవితం గురించి.. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనకముందు గాంధీజీ జీవితం ఎలా ఉండేది.. ఆయన ఫ్యామిలీ.. ఇలా మహాత్మా గాంధీ జీవితం గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఆయన ఆత్మకథ సత్యశోధన చదువాల్సిందే. ఆ పుస్తకం చదివితే చాలు.. గాంధీ నిజంగా మహాత్ముడు అంటూ ప్రశంసించకుండా ఉండలేం. ఆ పుస్తకంలో ఆయన సాధించిన విజయాలే కాదు.. ఆయన చేసిన తప్పులు.. ఒప్పులు అన్నీ ఉంటాయి. అందుకే ఆయనను బాపూజీ అంటారు. ఆ పుస్తకానికి కూడా సత్యశోధన అనే పేరు పెట్టారు గాంధీ.

గాంధీజీని సత్యం వైపుకు నెట్టినవి తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలే. అందులో ఒకదాని గురించి ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. గాంధీజీ చిన్నతనంలో చాలా తప్పులు చేశారట. అందరిలాగే తప్పులు చేశారు.. కానీ నేను తప్పు చేశాను అని తండ్రికి చెప్పలేకపోయారట. తండ్రి అంటే అంత గౌరవం, భయం. అందుకే తన తప్పులను తండ్రి ముందు ఒప్పుకోలేకపోయారు గాంధీ. దీంతో తన తప్పులన్నింటినీ ఒప్పుకుంటూ తండ్రికి ఓ ఉత్తరం రాశారు గాంధీ. ఆ ఉత్తరాన్ని చదువుతున్నప్పుడు గాంధీ తండ్రి కళ్లలో నుంచి టపా టపా కన్నీళ్లు కారుతూ ఉన్నాయట. ఆ సమయంలో ఉత్తరాన్ని చదువుతూ తన తండ్రి ఎలా బాధపడ్డారో.. గాంధీ ఎలా ఉద్వేగానికి లోనయ్యారో సత్యశోధనలో రాసుకున్నారు గాంధీ.

“నేను రాసిన ఉత్తరాన్ని ఆయన(గాంధీ తండ్రి) మొత్తం చదివారు. ఉత్తరం చదువుతుండగానే ఆయన చెంపల మీదుగా ముత్యాల్లాంటి అశ్రుబిందువులు (కన్నీళ్లు) టపాటపా జారి ఉత్తరాన్ని తడిపేశాయి. ఓ క్షణంపాటు ఆయన కళ్లు మూసుకున్నారు. తర్వాత ఆ ఉత్తరాన్ని చింపేశారు. నిలబడి ఉత్తరాన్ని చదివిన తర్వాత అక్కడే అలాగే కూర్చుండిపోయారు. ఆయన ఆ స్థితిలో ఉండటాన్ని చూసి నేను కూడా ఏడ్చేశాను. నా తండ్రి గుండెలో ఉన్న బాధ, దు:ఖాన్ని నేను చూడగలిగాను. నేను గనుక ఓ చిత్రకారుడిని అయి ఉంటే ఆ దృశ్యాన్ని చిత్రించగలిగేవాడిని. ఇప్పటికీ అది నా గుండెలో అలాగే ఉండిపోయింది. ఆయన స్వచ్ఛమైన ప్రేమ నా హృదయాన్ని ప్రక్షాళన చేసింది. అటువంటి ప్రేమను అనుభవించేవారికే దాని గురించి తెలుస్తుంది. ఆయనలో తండ్రి ప్రేమను తప్పించి మరేమీ చూడలేకపోయాను. అది నాకు అహింస పాఠమని అనిపించింది. ఇప్పుడు అది అహింస తప్ప మరేమీ కాదని గ్రహించాను..” అని రాసుకున్నారు బాపూజీ.

Read more RELATED
Recommended to you

Latest news