మన దాయాది దేశాలైన పాకిస్థాన్, చైనాలు మంచి మిత్రులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌కు చైనా ఆయుధాలు, యుద్ధ విమానాలు, ఇతర సామగ్రిని సరఫరా చేస్తుండగా, అటు చైనాకు తనకు తోచిన రీతిలో పాకిస్థాన్ కూడా సహాయం అందిస్తోంది. అందులో భాగంగానే ఇకపై పాకిస్థాన్ చైనాకు గాడిదలను కూడా సరఫరా చేయనుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు పాకిస్థాన్‌లో గాడిదల కోసం ఫాంలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
చైనాలో ప్రస్తుతం గాడిదలకు మంచి డిమాండ్ ఉందట. వారు గాడిదలతో మెడిసిన్లు, ఫర్నిచర్‌ను తయారు చేస్తారట. అందుకని వారు పాకిస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా ఖైబర్ పాక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో గాడిదలకు చెందిన పెద్ద ఫాంను ఏర్పాటు చేస్తున్నారట. అక్కడ సహజంగానే గాడిదలపై ఆధారపడి సుమారుగా 70వేల మంది జీవనం సాగిస్తున్నారట. అందుకని వారి కోసం ఫాంను ఏర్పాటు చేస్తే వారి నుంచి గాడిదలను కొనుగోలు చేసి వాటిని ఫాంలకు తరలించి అక్కడి నుంచి చైనాకు వాటిని ఎగుమతి చేస్తారట. ఈ మేరకు చైనా ప్రభుత్వం పాకిస్థాన్‌తో ఇప్పటికే ఒప్పందం కూడా కుదుర్చుకుందట.
ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం మొదటి మూడు సంవత్సరాల్లో ఏకంగా 80వేల గాడిదలను చైనాకు ఎగుమతి చేయనున్నారట. ఇందుకు గాను చైనా కంపెనీలు 3 బిలియన్ల డాలర్లను పాకిస్థాన్‌లో వెచ్చించనున్నాయట. చైనా ప్రభుత్వం, అక్కడి కంపెనీలతో పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే అనేక అగ్రిమెంట్లపై సైన్ కూడా చేసిందట. ఇక ఎగుమతిలో భాగంగా ముందుగా బలహీనంగా, వ్యాధులతో బాధపడుతున్న గాడిదలను ముందుగా చైనాకు తరలిస్తారట. తరువాత ఇతర గాడిదలను ఎగుమతి చేస్తారు. ఇలా చైనాకు గాడిదలను ఎగుమతి చేయడం వల్ల విదేశీ కరెన్సీ నిల్వలు పెంచుకోవచ్చని పాకిస్థాన్ భావిస్తోంది. అవును మరి.. అసలే ఆ దేశంలో పీకల్లోతు అప్పుల్లో ఉంది. ఇలాంటి వ్యాపారాలు చేయకపోతే ఆ దేశం మనుగడ సాగించడం కష్టమే మరి..!