చలికాలం అన్నాక.. సహజంగానే రాత్రి వేళల్లోనే కాకుండా పగటి పూట కూడా చలి ఉంటుంది. ఇక డిసెంబర్, జనవరి నెలల్లో అయితే మన దేశంలో చలి పంజా విసురుతుంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయి. దీంతో జనాలందరూ వెచ్చగా ఉండేందుకు రక రకాల మార్గాలను ఆశ్రయిస్తుంటారు. అయితే మనం ఇంత చలి ఉంటేనే భరించలేం.. కానీ ప్రపంచవ్యాప్తంగా మనుషులు నివాసం ఉండే ప్రాంతాల్లో అత్యంత శీతలంగా ఉండే ప్రాంతాలు ఏవో, ఆ ఏరియాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు ఓ లుక్కేద్దామా..!
1. డుడింకా, క్రాస్నోయార్‌స్క్ క్రాయ్ (రష్యా)
ఈ ప్రాంతంలో సుమారుగా 20వేల మంది నివాసం ఉంటారు. ఇక్కడి ఉష్ణోగ్రతలు చలికాలంలో – 24.5 డిగ్రీలకు పడిపోతాయి. అంటే అక్కడ ఎంత చలిగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక మంచు తుపాన్లు వచ్చినప్పుడు ఉష్ణోగ్రతలు మరింత దారుణంగా పడిపోతాయి. కొన్ని సార్లు ఉష్ణోగ్రతలు – 40 డిగ్రీలకు చేరుకుంటాయి. దీంతో వాహనాలు అస్సలు స్టార్ట్ కావు. వదిలే ఊపిరి, కన్నీళ్లు కూడా గడ్డ కట్టిపోతాయి. అంత చలిగా ఈ ప్రాంతంలో ఉంటుంది.
2. హర్బిన్, హెయ్‌లాంగ్‌జియాంగ్ (చైనా)
ఈ ప్రాంతంలో సుమారుగా కోటి మంది నివాసం ఉంటారు. ఈ నగరాన్ని ఐస్ సిటీ అంటారు. ఇక్కడ ఏటా ఇంటర్నేషనల్ స్నో అండ్ ఐస్ ఫెస్టివల్ జరుగుతుంది. చలికాలంలో ఇక్కడి ఉష్ణోగ్రతలు -24 నుంచి -42 డిగ్రీలకు పడిపోతాయి. దీంతో వాతావరణం మరింత కఠినంగా మారుతుంది. ఈ క్రమంలో జనాలు ఇళ్ల నుంచి అత్యంత అవసరం అయితే తప్ప బయటకు రారు.
3. విన్నిపెగ్, మనిబొటా (కెనడా)
ఈ ఏరియాలో సుమారుగా 7.15 లక్షల మంది నివాసం ఉంటారు. ఉత్తర అమెరికాలో అత్యంత శీతలంగా ఉండే నగరాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడి ఉష్ణోగ్రతలు చలికాలంలో – 20 నుంచి -45 డిగ్రీల వరకు పడిపోతాయి. దీంతో చలి ఎముకలను కొరికేలా అనిపిస్తుంది.
4. యాకుస్క్, సఖా రిపబ్లిక్ (రష్యా)
ఇక్కడ సుమారుగా 2.82 లక్షల మంది నివాసం ఉంటారు. చలికాలంలో ఇక్కడ -38 నుంచి -64 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఈ క్రమంలోనే ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత శీతలంగా ఉండే ప్రాంతమని చెబుతారు. ఇక్కడికి ఆర్కిటిక్ వలయం చాలా దగ్గరలోనే ఉంటుంది. అందుకనే చలి తీవ్రత అంత ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ ప్రాంతంలో చలికాలంలో జీవించడం చాలా కష్టతరమవుతుంది.
5. ఎల్లో నైఫ్, నార్త్‌వెస్ట్ టెర్రిటరీస్ (కెనడా)
ఇక్కడ సుమారుగా 20వేల మంది నివాసం ఉంటారు. ఆర్కిటిక్ వలయానికి దగ్గరగా ఉన్నందున ఇక్కడ కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. చలికాలంలో ఇక్కడ -21 నుంచి -51 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఆ వాతావరణంలో జనాల జీవనం చాలా కష్టంగా ఉంటుంది.