నకిలీ వార్తలను మరింత సమర్థవంతంగా నియంత్రించడానికి త్వరలో మరో కొత్త ఫీచర్ ను వాట్సాప్ యూజర్లకు అందివ్వనుంది.
ప్రస్తుతం మన దేశంలో సోషల్ మీడియాలో రోజూ ఎన్నో నకిలీ వార్తలు, పుకార్లు వ్యాపిస్తున్న విషయం విదితమే. నకిలీ వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో నకిలీ వార్తల వల్ల ప్రాణాలను పోగొట్టుకున్న బాధితులు కూడా ఉన్నారు. అయితే నకిలీ వార్తలను అరికట్టేందుకు ప్రముఖ సోషల్ యాప్ వాట్సాప్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నారు. వాటి సహాయంతో నకిలీ వార్తలకు చెక్ పెట్టడం కొంత వరకు సులభతరం అయింది.
వాట్సాప్‌లో వ్యాప్తి చెందతున్న నకిలీ వార్తలను, పుకార్లను అరికట్టేందుకు ఫార్వార్డెడ్ మెసేజెస్ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఒక మెసేజ్ అసలుదా, ఫార్వార్డ్ అయిన మెసేజా అని తెలుసుకునే వెసులుబాటును వాట్సాప్ కల్పించింది. అలాగే ఒక మెసేజ్‌ను కేవలం 5 మందికి మాత్రమే ఫార్వార్డ్ చేసేలా వాట్సాప్ చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే నకిలీ వార్తలను మరింత సమర్థవంతంగా నియంత్రించడానికి త్వరలో మరో కొత్త ఫీచర్ ను వాట్సాప్ యూజర్లకు అందివ్వనుంది. అదే సెర్చ్ ఇమేజ్ ఫీచర్..
వాట్సాప్ లో వస్తున్న సెర్చ్ ఇమేజ్ అనే ఫీచర్ సహాయంతో యూజర్లు తమకు వచ్చే ఫొటోలు అసలువా, నకిలీవా.. అని తెలుసుకోవడం సులభతరం అవుతుంది. అంటే. యూజర్ తనకు వాట్సాప్‌లో వచ్చిన ఇమేజ్‌పై ట్యాప్ చేసి సెర్చ్ ఇమేజ్ అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే అదే ఇమేజ్ గూగుల్‌లో సెర్చ్ అవుతుంది. దీంతో ఆ ఇమేజ్ అసలుదా, నకిలీదా అన్న విషయం మనకు ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఈ సెర్చ్ ఇమేజ్ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ బీటా వెర్షన్‌లో మాత్రమే లభిస్తుండగా, త్వరలో యూజర్లందరికీ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నారు.