త్వరలో లాంచీ ప్రయాణం..!?

-

రాజమహేంద్రవరం: ప్రస్తుతం చాలా మంది దేవాలయాలను దర్శించుకునేందుకు బస్సులు, కార్లులలో వెళ్తుంటారు. గంటల్లో చేరుకుని హడావుడిగా దేవుడిని దర్శించుకుని తిరుగు ప్రయాణం చేసేస్తుంటారు. ఎందుకు గుడికి వెళ్లారంటే.. మొక్కుబడి లెండి అని చెప్పి తోసి పడేస్తుంటారు. అయితే.. చాలా వరకు ప్రజలు ప్రముఖ దేవాలయాలను దర్శించుకునేటప్పుడు వాటి చుట్టుపక్కల ప్రాంతాల ప్రత్యేకతను గుర్తించరు. ఇలాంటి ఓ ప్రయాణం అలసటను ఇస్తుందే తప్ప ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పలేం. అలాంటి ప్రయాణాన్ని హాయిగా.. అనుభూతి కలిగించే విధంగా మార్చుకుంటే.. మీకు ఎన్నో మధుర జ్ఞాపకాలు చేరువవుతాయి. భద్రాది రామయ్యను దర్శించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గోదావరి జలాలపై రవాణాకు సన్నాహాలు చేస్తోంది.

boat

గోదావరిలో పడవ ప్రయాణం అంటే అందరికీ ఆనందదాయకమే. ప్రకృతిని ఆస్వాదించాలని అనుకునేవారు తప్పకుండా లాంచీ ప్రయాణం చేయాల్సిందే. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు లాంచీ ప్రయాణానికి సుముఖత చూపిస్తుంటారు. కానీ, నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, గతంలో కచ్చులూరు వద్ద పర్యాటక బోటు బోల్తా పడి 58 మంది మరణించడంతో పడవలో ప్రయాణమంటే ప్రజలు వెనుకడుగు వేయాల్సి వస్తోంది. ఈ ప్రమాదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల పటిష్ట భద్రతను దృష్టిలో పెట్టుకుని తగిన నిర్ణయాలు తీసుకుంది. ప్రయాణికుల ప్రాణాలను భద్రతను కల్పిస్తూ కార్యచరణ రూపొందించింది.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జల రవాణాను ప్రోత్సహించేందుకు ‘సాగరమాల’ అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం, భద్రాచలం, ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో అటవీ ఉత్పత్తుల తరలింపునకు గోదావరి నదిపై జల రవాణాను ప్రారంభించనుంది. జల రవాణాలో భాగంగా పోలవరం-పోచవరం మధ్య రవాణాకు అనువైన పరిస్థితులపై సర్వే చేపడుతోంది. దీనికి గానూ రూ.45 లక్షలు మంజూరు చేసింది.

గతంలో భద్రాచలం వెళ్లేందుకు రాజమహేంద్రవరంలో లాంచీ తెల్లవారుజామున 5 గంటలకే బయలుదేరేది. దేవీపట్నం మండలం కొండమొదలుకు మధ్యాహ్నం 12 గంటలకు, భద్రాచలానికి సాయత్రం 6 గంటలకు చేరుకునేది. ఒక లాంచీలో ట్రిప్పునకు 70 నుంచి 80 మందిని తీసుకెళ్లేవారు. అప్పట్లో టికెట్ ధర రూపాయి, ఐదు రూపాయలు ఉండేది. జలరవాణా ముగిసిపోయే దశలో రూ.100కు చేరింది. రాజమహేంద్రవరం నుంచి మధ్యప్రదేశ్ సరిహద్దు వరకూ గోదావరి నదిపైనే ప్రయాణాలు చేసేవారు. భద్రాద్రి దాటిన తర్వాత దుమ్ముగూడెం వద్ద ఆనకట్ట పైనుంచి వెంకటాపురం వరకూ లాంచీలు తిరిగేవి. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల నుంచి పడవల మీద వెదురు, పొగాకు, తునికాకు, పసుపు, మిర్చి వంటి సరుకులను రవాణా చేసేవారు. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం నుంచి మహారాష్ట్ర వరకూ 10 లాంచీలు, రాజమహేంద్రవరం నుంచి చత్తీస్ ఘడ్ లోని సాలాపూర్ మధ్య 4 లాంచీలు, పోలవరం నుంచి దేవీపట్నానికి 2 లాంచీలు ఉండేవి. నదులపై వంతెనల ఏర్పాటు చేయడంతో జలరవాణాకు ఆదరణ తగ్గతూ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news