ఈరోజుల్లో యువతి, యువకులకు టాటూ పిచ్చి బాగా పెరిగిపోయింది. సెలబ్రెటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరూ ఏదో ఒక టాటూ వేసుకుంటున్నారు. తమకి ఇష్టమైన వాళ్ళ పేర్లు, మనసుకు హత్తుకునే మెమరీస్‌కి గుర్తుగా చాలా మంది తమ శరీరంపై టాటూ వేయించుకుంటారు. ఇక టాటూలంటే పిచ్చి ఉండి ఒళ్ళంతా వేయించుకునే వాళ్ళని కూడా చూశాం. అలానే ఓ యువతి..టాటూ మీద ఉన్న ఇష్టంతో కళ్లు పోగొట్టుకోవాల్సి వచ్చింది.
ఒక్కోసారి ఆనందం కోసం తీసుకునే కొన్ని నిర్ణయాలు జీవితకాలం బాధని మిగులుస్తాయి. చేసిన తప్పు సరిదిద్దుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు ఈమె పరిస్థితి కూడా అదే అయ్యింది. అసలేం జరిగిందంటే..
నార్త్ ఐర్లాండ్‌కి చెందిన 32 ఏళ్ల అనయా పీటర్సన్ న్యాయ విద్యార్థిని.. ఆస్ట్రేలియన్ మోడల్ అంబర్ లూక్ మాదిరిగా తను కూడా కంటి లోపల టాటూ వేయించుకోవాలని అనుకుంది. దాదాపు 98 శాతం శరీరం అంతా పచ్చబొట్టు పొడిపించుకుని ఇప్పటికే ఫేమస్ అయ్యింది.. చివరికి తన కంట్లో కూడా పచ్చబొట్టు వేయించుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. అటువంటి లూక్ని ఆదర్శంగా తీసుకుని అనయా కూడా తన కంట్లో తెల్లని గుడ్డు మీద పచ్చ బొట్టు వేయించుకుంది.
జులై 2020లో ఆమె తన కుడి కన్ను లోపల టాటూ వేయించుకుంది. కొన్ని నెలలు బాగానే ఉంది ఎలాంటి సమస్యలు రాలేదు. కానీ తర్వాతే తను చేసింది ఎంత పెద్ద తప్పో అనేది తెలుసుకుంది. అప్పటికే పరిస్థితి చెయ్యి దాటి పోయింది. పచ్చబొట్టు కారణంగా పాపం తన కంటి చూపు పోగొట్టుకుంది. టాటూ వేయించుకున్న కొన్ని నెలల తర్వాత తన కన్ను పొడిబారిపోయి తల నొప్పి రావడం మొదలైంది.
అయినా తను మారలేదు అదే సంవత్సరం డిసెంబర్‌లో ఎడమ కంటి లోపల కూడా పచ్చబొట్టు వేయించుకుంది. తర్వాత కొన్ని రోజులకి తన కన్ను బాగా ఉబ్బెత్తుగా వాసిపోయింది. వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్ళగా పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు కంటికి శుక్లాలు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు తను అంధురాలిగా మారిపోయింది. రెండు కళ్ళల్లో పచ్చబొట్టు వేయించుకోవడం వల్ల ఆమె శాశ్వతంగా కంటి చూపును కోల్పోయింది.
పచ్చబొట్టులో ఉపయోగించే రసాయనాల వల్ల అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే పచ్చబొట్టు కోసం ఉపయోగించే ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నీలం రంగుల కారణంగా అలర్జీల తీసుకొస్తాయని వెల్లడించింది. పచ్చబొట్టు వేసిన ప్రదేశంలో దురద, దద్దుర్లు వస్తే వెంటనే చర్మ నిపుణులని కలిసి సరైన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. టాటూ వేయించుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ పరిస్థితి ఎదురుకావొచ్చు.