కేసీఆరే మళ్లీ సీఎం కావాలని నాలుక కోసుకున్న ఏపీ యువకుడు

సీఎం కేసీఆర్ కు ఒక్క తెలంగాణలోనే కాదు.. ఏపీలోనూ అభిమానులు ఉన్నారని అందరికీ తెలిసిందే. కేసీఆర్ గెలుపు కోసం ఏపీకి చెందిన ఆయన అభిమానులు పాదయాత్ర నిర్వహించడం, గుళ్లలో ప్రత్యేక పూజలు చేయడం మనం చూశాం. కానీ.. ఈ యువకుడు మాత్రం కేసీఆరే మళ్లీ సీఎం కావాలని తన నాలుకనే కోసేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో చోటు చేసుకున్నది.

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరానికి చెందిన మహేశ్.. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను చూసి ఆకర్షితుడయ్యాడు. కేసీఆర్ పై అభిమానం పెంచుకున్నాడు. తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కేసీఆర్ మళ్లీ సీఎం కావాలనుకున్నాడు. దీంతో హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లాడు. అక్కడ కేసీఆర్ గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అనంతరం వెంట తెచ్చుకున్న బ్లేడ్ తో తన నాలుకను కోసుకున్నాడు. అనంతరం ఆ నాలుకను హుండీలో వేశాడు. ఈ ఘటనను గమనించిన భక్తులు ఒక్కసారిగా భయపడ్డారు. మహేశ్ కు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. హుండీలో నుంచి అతడి నాలుకను తీసి అతడితో పాటే ఆసుపత్రికి తరలించారు. దీంతో వైద్యులు అతడికి సర్జరీ చేసి మళ్లీ ఆ నాలుకను అతికించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.