పల్లెలన్నీ ఏమయిపోతున్నాయి అన్న బెంగ ఎందరికో ఉంది. ఆ విధంగా పల్లెలకు మరియు పట్టణాలకు ఎడం ఏమయినా ఉండే ఉంటుందన్న అసహనం కూడా ఎందరిలోనో ఉంది. పల్లె ప్రకృతి పట్టణం వికృతి అని వినాశనం అని తిట్టిపోసిన సందర్భాలు అనేకం ఉన్నాయి ఎందరి జీవితాల్లోనో ఉంది. కనుక పల్లె మారింది అని పాడుకోవడం చాలా బెటర్ అని కొన్ని సార్లు అనిపిస్తోంది. పల్లె మారింది అని ఎందుకు అనుకోవడం అంటే నగరీకరణలో భాగంగా జీవితం మారింది.
అంతకుమునుపు పట్టణీకరణలో భాగంగా జీవితం మారి ఉంది. మారేందుకు మార్పులు చెందేందుకు కొన్ని ప్రయత్నాలు బాగా సహకరించాయి కూడా ! కొందరి స్వాప్నిక ప్రావస్థలను నిజం చేసేందుకు చాలా మార్పులు సహకరించాయి కూడా ! అందుకే అవ్యవస్థను కొన్ని సార్లు సంస్కరించాలి. అందుకే కొన్ని సార్లు వద్దనుకున్నా మార్పు ఉంటే అందులో మంచి గుణం ఉండే సంబంధిత పరిణామ గతిని స్వాగతించాలి. ఆ విధంగా ఇవాళ పల్లెలు మారిపోతున్నాయి. సంస్కృతులు కొన్ని విష తుల్యం అయి ఉన్నాయి..కొన్ని మాత్రం తమ జాగ్రత్తలో తాము ఉన్నాయి.
ఈ తరుణాన కొంతే మంచి అంతా చెడు అని నిర్థారించడంలో అర్థం లేదు కానీ పట్టణీకరణ, వలస వాదం అన్నవి తప్పనిసరి అయి ఉన్నాయి. ఆ విధంగా వలస వాదం కారణంగానే నగరీకరణలో కొన్ని సుందర స్వప్నాలు సాకారం అయ్యాయి. శ్రమ జీవుల జీవితాలు కొన్ని ఉపాధి బాట పట్టి తరువాత తమని తాము మెరుగుపరుచుకున్నాయి.ఆ విధంగా పట్టణీకరణ దశను దాటి నగరీకరణలో అడుగు పెట్టిన శ్రమ జీవి తనని తాను మార్చుకుని తన కుటుంబానికి వెలుగు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి.
కనుక అంతా చెడు అని చెప్పడంలో అర్థం లేదు. ఆ విధంగా దేశంలో నగరీకరణ పెరుగుతోంది. 1951 తో పోలిస్తే ఇప్పటి పరిస్థితులు తత్ భిన్నంగానే కాదు తత్ విరుద్ధంగానూ ఉన్నాయి. పోలికకే తూగని విధంగా పరిణామాలు ఉన్నాయి. ఆ రోజు పట్టణ జనాభా శాతం 17.29 శాతం ( మొత్తం జనాభా : 36.10 కోట్లు), ఈ రోజు పట్టణ జనాభా శాతం యాభై శాతానికి పైగా ఉందని ఓ అంచనా.. ఇప్పటి జనాభా 164 కోట్లు. ఇవీ ప్రస్తుత గణాంకాలు చెబుతున్న నిజాలు.