నలుగురు బాలికల మిస్సింగ్ కేసు.. 12 గంటల్లో చేధించిన ఏపీ పోలీసులు

-

విశాఖలోని ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో నలుగురు బాలికలు అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు 12 గంటల్లోపే వారిని వెతికి పట్టుకున్నారు. పదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినులు బుధవారం.. స్కూల్‌ విడిచి పెట్టగానే ట్యూషన్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ వారు ట్యూషన్​కు వెళ్లకుండా ఎక్కడికో వెళ్లిపోయారు.

రాత్రయినా పిల్లలు ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వారు రాసిన లేఖ దొరకడంతో మరింత భయానికి గురయ్యారు. అర్ధరాత్రి 1 గంట వరకు వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఏడీసీపీ శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు జిల్లా అంతటా జల్లెడ పట్టారు. చివరకు వారు గాజువాకలో ఉన్నట్లు తెలుసుకున్నారు. గురువారం మధ్యాహ్నం వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి, తల్లిదండ్రులకు అప్పగించారు.

ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు బాలికలు ఓ లేఖ రాశారు. అందులో ఏం ఉందంటే.. ‘మాకోసం వెతక్కండి మా కాళ్ల మీద మేం బతికేందుకు దూరంగా వెళ్లిపోతున్నాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. మేం అబ్బాయిలతో వెళ్తున్నామని అనుకోకండి. ఎదగడానికి వెళ్తున్నాం. ఎక్కడున్నా సరే మీ గురించే ఆలోచిస్తాం. మంచి స్థాయికి వచ్చాక వస్తాం’ అని లేఖలో రాశారు. ఈ లేఖను నలుగురిలోని ఓ బాలిక ఇంట్లో ఉంచి, ఎక్కడికైనా వెళ్లిపోదామని బయలుదేరారు. ఆరోజు సాయంత్రం 6 గంటల నుంచి వారు సాగర తీరం, ఆర్టీసీ కాంప్లెక్సు, రైల్వేస్టేషన్‌ ఇలా పలు ప్రదేశాలు తిరిగారు. ఎట్టకేలకు చివరకు గాజువాకలో పోలీసులకు దొరికారు.

Read more RELATED
Recommended to you

Latest news