విజయవాడ: మరో రెండు, మూడు నెలల్లో చంద్రబాబు పదవి ఊడటం ఖాయమనిబిజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడ నగర బిజేపీ అధ్యక్షుడిగా అడ్డూరి శ్రీరామ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తండ్రీకొడుకులు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటి దాడుల కేసు చివరకు చంద్రబాబుకు చుట్టుకుంటుందని, ఆయనపై కూడా కేంద్రం విచారణకు ఆదేశించవచ్చని ఊహాగానాలు రేగుతున్న సమయంలో కన్నా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. చంద్రబాబుది అన్నం పెట్టే చేయినే నరికే పద్దతి అని.. కేంద్రాన్ని కూడా అలాగే మోసం చేశారని కన్నా విమర్శించారు. పచ్చ కండువా కప్పుకున్న వారికే నిధులు, సంక్షేమ పథకాలు అందుతున్నాయని వ్యాఖ్యానించారు. అమరావతి నిర్మాణం కోసం సేకరించిన విరాళాలు ఏమయ్యాయో చంద్రబాబు వెల్లడించాలని కన్నా డిమాండ్ చేశారు.