టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. లోకేశ్ పాదయాత్రపై పాజిటివ్ న్యూస్ కంటే నెగెటివ్ వార్తలే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. నాయకత్వం అనేది స్వయంగా ప్రకాశించాలని, బలవంతంగా రుద్దుడు కార్యక్రమంతో నాయకత్వం అభివృద్ది చెందదని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. ఎక్కడైనా అంతిమ నిర్ణేతలు ప్రజలేనని, వారే తేల్చుతారని స్పష్టం చేశారు. లోకేశ్ పాదయాత్ర స్థానికంగా కూడా సంచలనాత్మక రీతిలో సాగుతున్నట్టు అనిపించడంలేదని అన్నారు.
ఎవరెన్ని చెప్పినా జనసేనతోనే పొత్తు ఉంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు.ఆదివారం నాడు విశాఖపట్టణంలో జీవీఎల్ నరసింహరావు మీడియాతో మాట్లాడారు.సచివాలయం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని ఆయన చెప్పారు. వైజాగ్ మెట్రో ఆలస్యం కావడానికి ప్రభుత్వ ఉదాసీనతే కారణంగా ఆయన పేర్కొన్నారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న ఎంపీలకు అవగాహన అవసరమని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉంది. అయితే ఇటీవల భీమవరంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భావసారూప్యత గల పార్టీలతో పొత్తు ఉంటుందని బీజేపీ తీర్మానం చేసింది.